వద్దు బాబోయ్ ఆక్టోపస్ పదవి హైదరాబాద్ : రెండేళ్ళక్రితం రాష్ట్రప్రభుత్వం నూతనంగా సృష్టించిన 'ఆక్టోపస్' చీఫ్ ఉన్నత పదవి కోసం పోలీసు ఉన్నతాధికారులు పలువురు ఆసక్తిని చూపారు. అక్కడ అధిక వేతనం రావడంతో పాటు... దేశంలోనే ఈ పదవిని నమూనాగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పం కారణంగా పోలీసు ఉన్నతాధికారులు ఆ పదవిలో పని చేయడానికి ఉత్సాహం చూపారు. కానీ ప్రస్తుత దృశ్యం మారింది. ఆక్టోపస్ అంటేనే అధికారులు ఆమడదూరం పరిగెడుతున్నారు. ఆ'పోస్ట్'లోకి వెళితే కలిసిరాదన్న అప'నమ్మకం' ఏర్పడటమే ఇందుకు కారణం!
పోలీసు డీజీపీ యాదవ్ ఈ పదవిలో సీనియర్ అధికారిని నియమించేందుకు చుక్కాని వేసి అన్వేషిస్తున్నారు. ఉగ్రవాదులపై పోరాడేందుకు రెండేళ్ళ క్రితం నెలకొల్పిన ఈ ఆక్టోపస్ పదవికి అడిషనల్ డీజీపి హోదా ఉంటుంది. ఈ పోస్ట్ లో పనిచేయడానికి ఇప్పటికే ఇద్దరు పోలీసు అధికారులు తిరస్కరించారని సమాచారం. ఆక్టోపస్ కు తొలి అధిపతిగా పనిచేసిన ఎకె మహంతి కొద్ది నెలలకే బదిలీ అయ్యారు. ఈ విషయమై ఒక అధికారి మాట్లాడుతూ ఆక్టోపస్ ను సంస్థాగతంగా నిర్మాణం చేసిన వ్యక్తి ఆయన. అయినా నిర్దాక్షిణ్యంగా తొలగించారని వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్ లకు మహంతి తరువాత వచ్చిన ద్వారకా తిరుమల రావు కూడా తనను బదిలీ చేయండి అంటూ ప్రభుత్వానికి మొర పెట్టుకున్నారు.
కొద్ది కాలం క్రితం జరిగిన బదిలీలలో ఆక్టోపస్ చీఫ్ గా వివేక్ దూబే నియమితులయ్యారు. అయితే నోయిడాలోని తన నివాసంలో ఆర్డర్లీ విధులకోసం వెళ్ళిన కానిస్టేబుల్ మురళీనాథ్ అనుమానస్పద స్థితిలో మృతి చెందడంతో వివాదంలో ఆయన చిక్కుకున్నారు. ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న దూబే బాధ్యతలను ఉమేష్ రావ్ కు అప్పగించారు. ప్రస్తుతం సిబ్బంది సంక్షోభాన్ని చూస్తున్న ఉమేష్ రావు డీజీపీ యాదవ్ ను కలిశారు. ఆక్టోపస్ అదనపు బాధ్యతలను తాను నిర్వహించలేకపోతున్నానని, ఈ బాధ్యతల నుంచి తనను తప్పించాలని డీజీపీకి తెలియజేసినట్టు విశ్వసనీయవర్గాల కథనం.
News Posted: 1 September, 2009
|