నీడ లేని మంత్రులు న్యూఢిల్లీ : ప్రజల కనీస అవసరాలు తీర్చేందుకు ప్రయత్నించే ప్రభుత్వంలో మంత్రులకు ఢిల్లీలో 'ఆవాసం' కరువైంది. ఇటీవలే నూరు రోజుల పాలన పూర్తిచేసిన ప్రభుత్వ సారధి మన్మోహన్ సింగ్ నూరు రోజుల్లో చాలా లక్ష్యాలు సాధించగలం అని భావించవచ్చేమో కానీ... మంత్రులకు మాత్రం ఇంకా నిలువ 'నీడ' దొరకలేదు. వీరందరికి క్వార్టర్లను కేటాయించారు. అయితే కొన్నింటిని 'మాజీ'లు ఖాళీ చేయకపోవడంతో... ఆయా క్వార్టర్లు పొందిన మంత్రులకు - ఆయా రాష్ట్రానికి చెందిన భవనాలు, హోటల్ రూమ్ లే 'తాత్కాలిక' కార్యాలయాలుగా మారాయి. ఇటీవలవరకు మహారాష్ట్ర గవర్నర్ గా విశాలమైన 'రాజభవనం'లో కాలం వెళ్ళదీసిన విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ఎమ్ కృష్ణ మౌర్య షెరటాన్ హోటల్ లోని గదిని కార్యాలయంగా చేసుకున్నారు. తీన్ మూర్తి లైన్ లో ఆయనకు క్వార్టర్ కేటాయించినా, దాన్ని మరమ్మతులు చేసేందుకు 'మంచి రోజు'ల కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన సహాయకుడు శశిధరూర్ పరిస్థితి కూడా అంతే. లోఢీ రోడ్ లోని భవనం ఇంకా రడీ కాకపోవడంతో ఆయన తాజ్ హోటల్ ను ఆశ్రయించారు.
కేంద్రమంత్రులు విలాసరావు దేశ్ ముఖ్, మల్లికార్జున ఖర్గేలు కూడా క్వార్టర్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ఖర్గే అయితే కర్నాటక నుంచి తొలిసారి ఎంపీలైన వారితో కలిసి కర్నాటక భవన్ లో రోజులు లెక్కిస్తున్నారు. తమకు కేటాయించిన నివాసాలకు త్వరలో వెళ్తామని ఖర్గే చెబుతున్నారు. లోకీ రోడ్ లో ఒక భవనాన్ని కేటాయించినా, దానిని మరమ్మతులు చేస్తున్న కారణంగా దేశ్ ముఖ్ 'గెయిల్' సంస్ధకు చెందిన 'అతిథి' గృహంలో నివసిస్తున్నారు. ఇంకా క్వార్టర్ల కేటాయింపుల కోసం ఎదురుచూస్తున్న వారిలో ఆహారమంత్రి కేవీ థామస్, హోం సహాయమంత్రి ఎం.రామచంద్రన్, గుర్తింపు కార్డుల ప్రాజెక్ట్ అధిపతి నందన్ నీలేకని ఉన్నారు. 'మంత్రులందరికీ నివాసాలు కేటాయించాం. ఇంతకుముందు నుంచీ వాటిల్లో ఉంటున్నవారు ఖాళీ చేయాలి, కొన్ని చోట్ల మరమ్మతులు అవసరం అయ్యాయి. ఈ పరిస్థితులు చక్కబడటానికి కొంత సమయం పడుతుంది' అని అభివృద్ధిశాఖ అధికారులు చెప్పారు.
News Posted: 1 September, 2009
|