పువ్వులమ్మిన చోటే... హైదరాబాద్ : ఇంజనీరింగ్, ఎంబిఎ, ఎంసిఎ వంటి వృత్తి విద్యాకోర్సుల సీట్లకు లక్షలు పలికించిన కళాశాలల యాజమాన్యాలు ఇపుడు తమకు ఆ సీట్లు వద్దని, వాటిల్లో విద్యార్థులు చేరడంలేదని, ప్రభుత్వమే వాటిని నింపాలని మొరపెట్టుకుంటున్నాయి. నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ వంటి సంస్థల అనుమతి పొందిన రెండు మూడు డజన్ల కాలేజీలు తప్పిస్తే రాష్ట్రంలోని మిగిలిన వెయ్యికి పైగా కాలేజీల పరిస్థితి ఈసారి ఇలా దారుణంగా తయారైంది. వీటిలో 15 శాతం కాలేజీలు మైనార్టీ హోదా పొందాయి. మైనార్జీ కాలేజీలు సైతం తమ పరిధిలో ఉన్న కేటగిరి - బి సీట్లను, యాజమాన్య కోటా సీట్లను కూడా ప్రభుత్వమే కేటగిరి - ఎ పరిధిలో భర్తీ చేయాలని కోరుతున్నాయి. సింగిల్ విండో-1 కింద ర్యాంకుల ఆధారంగా ప్రభుత్వ కన్వీనర్ సీట్లను భర్తీ చేస్తారు. ఈ కేటగిరి కింద ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీల్లో వంద శాతం సీట్లను, అన్ ఎయిడెడ్ నాన్ మైనార్టీ కాలేజీల్లో 70 శాతం సీట్లను మాత్రమే కన్వీనర్ భర్తీ చేస్తారు.
మైనార్టీ కాలేజీల్లో 70 శాతం సీట్లను సింగిల్ విండో - 2 కన్వీనర్ భర్తీ చేస్తారు. మిగిలిన 30 శాతం సీట్లను యాజమాన్యాలే భర్తీ చేసుకుంటాయి. ఈ నిబంధనలను ఉపయోగించుకుని యాజమాన్యాలు తమ పరిధిలోని సీట్లను ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులకు మించి లక్షలాది రూపాయిలకు విక్రయించేవి. గత ఏడాది యాజమాన్య కోటా సీట్లనూ మెరిట్ ఆధారంగానే భర్తీ చేయాలనే నిబంధన పెట్టడంతో తమకు నచ్చిన అభ్యర్థులతో సీట్లను భర్తీచేసుకునే వీలు లేకుండా పోయింది. దీనికి తోడు ఆర్థిక మాంద్యం దెబ్బ పడటంతో ఇంజనీరింగ్, ఎంసిఎ కోర్సుల్లో చేరేందుకు సాధారణ విద్యార్థులు పెద్దగా సుముఖత వ్యక్తం చేయకపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. కొన్ని ఎంబిఎ, ఎంసిఎ కాలేజీల్లో రెండు మూడు సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.
గత జూన్ లోనే అడ్మిషన్ల తంతు మొదలైనా, చివరి నిమిషంలో తమ సీట్లు భర్తీ కాకపోతాయా అని ఎదురుచూసిన యాజమాన్యాలు తీరా సమయం మించిపోతున్నా విద్యార్థులు చేరకపోవడంతో కాళ్ళబేరానికి వచ్చాయి. దాంతో ఈ కాలేజీలు అన్నీ తమ పరిథిలోని సీట్లను ప్రభుత్వానికి సరెండర్ చేసేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ దశలో నింబధనలను అతిక్రమించి ఆ కాలేజీల్లో అడ్మిషన్లు చేయలేమని ఉన్నత విద్యా మండలి అధికారులు చెబుతున్నారు. ఒక దశలో కాలేజీల్లో మిగిలిపోతున్న సీట్లను ప్రభుత్వమే భర్తీచేయాలంటూ విద్యార్థి సంఘాలతో ధర్నాలు కూడా చేయించాయి. దానికి అధికారులు లొంగకపోవడంతో నేరుగా యాజమాన్యాలే వత్తిడి తేవడం మొదలు పెట్టాయి.
ఈ అంశంపై సోమవారం రాత్రి ఉన్నత విద్యా మండలి చైర్మన్ కెసి.రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాతూ ఉన్న నిబంధనల ప్రకారం మైనార్టీ కాలేజీలు, అన్ ఎయిడెడ్ కాలేజీల యాజమాన్యాల డిమాండ్ ను అంగీకరించలేం, అయితే దీనిపై తుది నిర్ణయం ప్రభుత్వం తీసుకోవల్సి ఉందని పేర్కొన్నారు. యాజమాన్యాల డిమాండ్ ను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా తాము ముందుకు సాగుతామని ఆయన చెప్పారు. కాగా ఇంజనీరింగ్ విద్యార్థుల అలాట్ మెంట్ లను సెప్టెంబర్ 4 లోగా పూర్తిచేస్తామని ఆయన వెల్లడించారు.
News Posted: 1 September, 2009
|