'అంతటి మగాడా వైఎస్' హైదరాబాద్ : ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పెద్ద మగాడేమీ కాదు... తెలివైన వాడూ కాదు... ఇందిరాగాంధీయే టిడిపిని ఏమీ చేయలేకపోయారు ఈయనెంత? వెయ్యి మంది వైఎస్ లు వచ్చినా తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరని ఆ పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు మండిపడ్డారు. అసెంబ్లీలోని తన చాంబర్ లో మంగళవారం చంద్రబాబు విలేఖరులుతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. టిడిపి పని ఫినిష్ అయిందంటూ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వాళ్ళను చాలా మందిని చూశామన్నారు. వైఎస్ ఎప్పుడూ అసమ్మతి వాదిగా ఉండేవారు... కాంగ్రెస్ ను ఉద్ధరించడానికే వచ్చాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు, 1978లో వెంగళరావు కాంగ్రెస్ తరఫున గెలిచి మూడు నెలల్లో రాజీనామా చేసి కాంగ్రెస్ లోచేరి మంత్రి అయ్యారని విమర్శించారు.
ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇందిరాగాంధీ టిడిపిని ఏదో చేయాలని చూశారని, ప్రజలు కార్యకర్తలు ఉద్యమించిన తరువాత ఎన్టీఆర్ ను తిరిగి ముఖ్యమంత్రిని చేయకతప్పలేదని అన్నారు. ఇందిరాగాంధీయే టిడిపిని ఏమీ చేయలేకపోయారని, వైఎస్ లాంటి వాళ్ళు వెయ్యి మంది వచ్చినా టిడిపిని ఫినిష్ చేయలేరని అన్నారు. పివి నరసింహారావు కూడా టిడిపిని ఏదో చేయాలని ప్రయత్నించారని, ఎంపీలను తనవైపు తిప్పుకున్నారని అన్నారు. మొన్నటి ఎన్నికలలో పలువురు నాయకులు పార్టీ వీడి వెళ్లినా కార్యకర్తలు పార్టీని వీడి వెళ్ళలేదని చంద్రబాబు తెలిపారు. అధికారం, డబ్బుతో ఏదైనా చేయవచ్చునని ముఖ్యమంత్రి భావిస్తున్నారని, ఒకరిద్దరిని ప్రలోభపెట్టి తమ పార్టీ వైపు తిప్పుకుంటున్నారని దీనివల్ల ఏమీ కాదని అన్నారు.
ముఖ్యమంత్రికి అహంకారం నెత్తికెక్కింది. దుర్యోధనుడిలా మాట్లాడుతున్నారు, ఆయన ప్రవర్తన ఎలా ఉందో ఆయన మాటలే చెబుతున్నాయి. టిడిపి ఫినిష్ అయింది, శాసనసభలో ప్రతిపక్షాలతో ఆడుకుంటున్నాను అని చెప్పడం ఆయనలోని అహంభావానికి పరాకాష్టని చంద్రబాబు విమర్శించారు. అసెంబ్లీ ప్రజా సమస్యలను చర్చించాల్సిన వేదిక కానీ, ఆడుకునే ఆటస్థలం కాదని అన్నారు. ముఖ్యమంత్రి మాటలు శృతిమించి రాగాన పడుతున్నాయని అన్నారు. గేటు తోసుకుని వస్తున్నారు, మేం అందరినీ తీసుకోం... సెలక్టివ్ గా తీసుకుంటాం అంటూ ముఖ్యమంత్రి స్థాయలో ఉండి నీతిలేని మాటలు మాట్లాడుతున్నారని చంద్రబాబు వివర్శించారు. నీతిమాలిన రాజకీయాలకు పాల్పడుతూ ప్రలోభపెడుతూ కొంతమందిని కాంగ్రెస్ లో చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, ప్రలోభాలకు లొంగే ఒకరిద్దరు ఎప్పుడూ ఉంటారని చంద్రబాబు తెలిపారు. రోజా గురించి ప్రశ్నించగా ఆమె గురించి మాట్లాడేందుకు చంద్రబాబు నిరాకరించారు.
News Posted: 2 September, 2009
|