హైదరాబాద్ : పీకలలోతు అవినీతి ఊబిలో కూరుకుపోయిన అఖిల భారత సాంకేతిక విద్యామండలిని (ఎఐసిటిఇ) సంస్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీని చైర్మన్ పదవిలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.సి.రెడ్డిని నియమించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేంద్రంపై వత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. కెసిరెడ్డికి చైర్మన్ పదవి లభిస్తే రాష్ట్రానికి ఎంతో ఉపయోగం కలుగుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ గా ప్రొఫెసర్ కెసి.రెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వ ఆధీనంలో 20కి పైగా యూనివర్శిటీలను కొత్తగా ఏర్పాటు చేయడంలో కీలక పాత్రను పోషించారు. సంప్రదాయ యూనివర్శిటీలుగా కాకుండా వీటిని స్పెషాలిటీ వర్శిటీలుగా ఏర్పాటు చేయడంలో ఆయన పోషించిన కీలక పాత్ర అటు జాతీయ విజ్ఞానమండలి (నేషనల్ నాలెడ్జి కమిషన్) దృష్టిని కూడా ఆకర్షించింది.
ఉన్నత విద్యావ్యహారాల్లో ఆంధ్రప్రదేశ్ చేపట్టిన అనేక సంస్కరణలు మిగిలిన రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉన్నాయని కూడా నాలెడ్జి కమిషన్ చైర్మన్ డాక్టర్ శ్యాంపిట్రోడా అనేక మార్లు ప్రశంసించారు. కేంద్ర మానవ వనరుల మంత్రి కపిల్ సిబాల్ అన్వేషణలో ప్రొఫెసర్ కె.సి.రెడ్డి సమర్థుడిగా ముద్ర పడటంతో ఎఐసిటిఇ సంస్కరణలకు కెసిరెడ్డి సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తిగా ముద్రపడిన కెసిరెడ్డి సేవలను కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకోవాలని ఆయన సిఫార్సు చేసినట్లు కూడా తెలిసింది. కపిల్ సిబాల్ సైతం ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడు కావడంతో ప్రొఫెసర్ కె.సిరెడ్డి నియామకం తేలికయిందని, ఇప్పటికే ఈ విషయమై కపిల్ సిబాల్ ప్రధాని మన్మోహన్ సింగ్ తో చర్చించినట్లు తెలిసింది.
కెసిరెడ్డి ఢిల్లీకి వెళ్ళినట్లయితే ఆయన స్థానంలో నియమించేందుకు కొత్త వారికోసం ప్రభుత్వం అన్వేషణ ప్రారంభించింది. ఎపిపిఎన్ సి చైర్మన్ డాక్టర్.వై వెంకటరామిరెడ్డిని ప్రొఫెసర్ కె.సి.రెడ్డి స్థానంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా నియమించి ఆయన స్థానంలో నిన్ననే పదవీ విరమణ చేసిన ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డిని నియమించాలని అనుకున్నారు. అయితే ఎపిపిఎన్ సి చైర్మన్ గా బాగా పనిచేస్తున్న వెంకట్రామిరెడ్డిని మార్చడం మంచిది కాదన్న అభిప్రాయంతో ఆ ఆలోచనను ప్రభుత్వం మానుకుంది. దీంతో సమర్ధుడైన మరో విద్యావేత్త కోసం ప్రభుత్వం వెతుకుతోంది.