పేదరికానికి కొత్త కొలతలు న్యూఢిల్లీ : దేశంలో పేదరికాన్ని అంచనా వేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ కొత్త ప్రమాణాలతో ముందుకు వస్తున్నది. కుటుంబానికి గల ఐదు అర్హతలను పరిగణనలోకి తీసుకొని పేదలను గుర్తిస్తుంది. నెలసరి ఆదాయం, నివసించే ఇల్లు, ద్విచక్రవాహనం, సొంత భూమి ఆధారంగా దారిద్ర్య రేఖకు దిగుననున్న (బీపీఎల్) కుటుంబాలను అధికారులు లెక్కిస్తారు. దీని ప్రకారం నెలకు ఐదువేల రూపాయలు ఆదాయం, పక్కాగృహంలో నివసిస్తున్న వారిని బీపీఎల్ నుంచి మినహాయిస్తారు. సొంత ద్విచక్రవాహనం కలిగి ఉన్నా, వ్యవసాయంలో ట్రాక్టర్ ను వాడుతున్నా, జిల్లాలో తలసరి భూమి కన్నా ఎక్కువ భూమి కలిగిన వారిని బీపీఎల్ జాబితా నుంచి తప్పిస్తారు. ఈ ఐదింటిలో ఏ ఒక్కటి లేదా ఎక్కువ అర్హతలు ఉన్న కుటుంబాలను బీపీఎల్ నుంచి మినహాయిస్తారని అధికారులు చెబుతున్నారు.
పేద కుటుంబాలను గుర్తించేందుకు నిర్దేశించిన కొత్త ప్రమాణాలను ప్రభుత్వం ఆమోదించిందని వారు వెల్లడించారు. ఈ ప్రమాణాలను గ్రామీణాభివద్ధి శాఖ మాజీ కార్యదర్శి ఎం శంకర్ అధ్యక్షతన కమిటీ రూపొందించింది. బీపీఎల్ వర్గంగా గుర్తించడం అంటే ప్రభుత్వం అమలు చేసే పథకాల ద్వారా అర్హత లభించినట్లు కాగలదు. ప్రస్తుతం అమలులో ఉన్న బీపీఎల్ జాబితా 2002లో పదమూడు రకాల సామాజిక, ఆర్థిక అర్హతలు ఆధారంగా గుర్తించారు. తొలిగా బీపీఎల్ గణన నెలవారీ ఆదాయం ఆధారంగా 1992లో లెక్కించారు. తరువాత ఆయా కుటుంబాల వినియోగశక్తి ఆధారంగా 1997లో మరోసారి బీపీఎల్ జనాభా లెక్కించారు. దారిద్ర్యరేఖ దిగువనున్న జనాభా గుర్తింపు ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటుంది. గ్రామీణ అభివృద్ది శాఖలో కార్యదర్శిగా పనిచేసిన ఎన్ సి సక్సేనా ఆధ్వర్యంలోని కమిటీ సూచించిన సూచనలు అమలు చేస్తే... బీపీఎల్ జనాభా గుర్తింపు పెను వివాదాన్ని సృష్టిస్తుంది. ఈ విధానంలో ప్రస్తుతం అనుసరిస్తున్న ప్రమాణాలకు తోడుగా కులాన్ని పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఎంబీసీ, ఇతర వెనుకబడిన తరగతలను అదనపు అర్హతలుగా గుర్తించాలని సూచించారు. అయితే ఈ విధానం వివాదానికి దారి తీస్తుందని దీనిపై అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
News Posted: 2 September, 2009
|