హైకోర్టు భవనమే అక్రమం! హైదరాబాద్ : హైకోర్టులో దశాబ్దం క్రితం నిర్మించిన పరిపాలనా భవన సముదాయానికి నగరపాలక సంస్థ అనుమతి లేదన్న విషయం మరోసారి తెరపైకి వచ్చింది. సోమవారం ఉదయం హైకోర్టులో రెండస్థులు అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. పరిపాలనా భవనానికి అగ్నిమాపక శాఖనుంచి నిరభ్యంతర పత్రం మంజూరు కావాలి. అగ్నిప్రమాదం సంభవిస్తే అరికట్టడానికి వీలుగా ఏర్పాట్లు చేసిన పక్షంలో ఈ పత్రాన్ని ఇస్తారు. సోమవారం అగ్ని ప్రమాదానికి గురైన హైకోర్టు భవనానికి అగ్నిమాపక శాఖ అనుమతి అక్కరలేదు. ఎందుకంటే ఈ నిబంధన ఎత్తైన భవనాలకు 1982 తర్వాత అమలు ప్రారంభమైంది.
హైకోర్టులోని పరిపాలనా భవన సముదాయానికి అనుమతి లేదన్న విషయం తొలుత 2006లో వెలుగులోకి వచ్చింది. ఎత్తైన భవనాల్లో అగ్నిప్రమాదం నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు చర్చకు వచ్చిన కేసులో నగరంలో సరైన అనుమితి లేని భవనాల జాబితాను అధికారులు సమర్పించారు. పదిహేడు ప్రభుత్వ భవనాలున్న ఈ జాబితాలో హైకోర్టు భవనంతో పాటు, డిజీపీ కార్యాలయం, బషీర్ బాగ్ లోని పోలీసు కమిషనర్ కార్యాలయం, బేగం పేట్ లోని పర్యాటక భవన్, సైఫాబాద్ లోని అరణ్య భవన్ ఉన్నాయి. ఈ మూడేళ్ళల్లో పర్యటక భవన్, అరణ్య భవన్ లు జీహెచ్ ఎంసీ అనుమతులు పొందాయి. డీజీపీ కార్యాలయం, పరిపాలనా భవనం కోసం హై కోర్టు ఈ మేరకు అనుమతులు పొందలేదు. అన్నట్టు 2006లో అక్రమ కట్టడాల కేసు విచారణ సమయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సింఘ్వి 'హైకోర్టు ముందస్తు అనుమతి లేకుండా సంబంధిత కట్టడాన్ని కూల్చవచ్చు' అని వ్యాఖ్యానించారు.
News Posted: 2 September, 2009
|