ధిక్కారంపై ఆగ్రహం న్యూఢిల్లీ : రాష్ట్ర కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న గందరగోళ పరిస్థితులపై అధిష్టానం ఆగ్రహంతో ఉంది. దాంతో ధిక్కారానికి దిగితే తీవ్ర పరిణామాలు తప్పవనే స్పష్టమైన సంకేతాలను ఇచ్చింది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రోశయ్యను మరి కొంతకాలం కొనసాగించడం ద్వారా రాష్ట్ర కాంగ్రెస్ లో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దవచ్చని అధినాయకత్వం భావిస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వచ్చేవారం రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులతో చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరన్నది తేలుస్తారు. సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ కు చెందిన కొందరు సీనియర్ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ను రంగంలోకి దించి దిద్దుబాటును ప్రారంభించింది. రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన హైదరాబాద్ కు వెళ్ళారు. కాంగ్రెస్ అధినాయకత్వం ఆదేశంమేరకే ఆయన ఆదివారం నాడు రోశయ్య, శ్రీనివాస్, రాజసభ సభ్యుడు కె.వి.పి.రామచంద్రరావు తదితరులతో చర్చలు జరిపారని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.
కాగా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్, న్యాయశాఖ మంత్రి వీరప్పమొయిలీ ఆదివారం సోనియాగాంధీని కలసి రాష్ట్ర కాంగ్రెస్ లో కొనసాగుతున్న వ్యవహారాలనూ, ముఖ్యమంత్రి కె.రోశయ్య మంత్రి వర్గంలో చేరేందుకు కొందరు మాజీ మంత్రులు నిరాకరించడం గురించి ఆయన పార్టీ అధ్యక్షురాలు సోనియాకు గురించి వివరించారు. దాదాపు పదిహేను నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, పరిణామాల గురించి వారు సమీక్షించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సోనియా గాంధీతో తాను జరిపిన చర్చల వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించేందుకు గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన సంతాపసభలో ఆయన మద్దతుదారులు వ్యవహిరంచిన తీరు, ముఖ్యంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ను మాట్లాడనివ్వకపోవడం, తదితర అంశాలు కూడా పార్టీ నాయకత్వం దృష్టికి వచ్చాయి.
మామూలుగా అయితే సోనియా గాంధీ ఆదివారం నాడు పార్టీ నాయకులెవ్వరినీ కలుసుకోరు. అయితే రాష్ట్ర కాంగ్రెస్ లో మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించాలంటూ కొందరు శాసనసభ్యులు, లోక్ సభ సభ్యులు, నాయకులు చేస్తున్న గొడవ రాష్ట్రంలో పార్టీకి తీరని నష్టం కలిగిస్తుందని భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ని ఏం చేయాలనే అంశంపై కాంగ్రెస్ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. ఆయనను రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చాలా? లేక మంత్రివర్గంలో సహాయమంత్రిగా నియమించల? అనే అంశాన్ని కాంగ్రెస్ అధినాయకత్వం లోతుగా పరిశీలిస్తోందని అంటున్నారు. రోశయ్యనే కొంతకాలం పాటు ముఖ్యమంత్రిగా కొనసాగించి ఆ తరువాత ఏం చేయాలనేది నిర్ణయించవచ్చునని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోందని అంటున్నారు. రాజశేఖరరెడ్డి ప్రారంభించిన వివిధ సంక్షేమ పథకాలను యథాతథంగా అమలు చేయాలని కాంగ్రెస్ అధిష్టానవర్గం రోశయ్యకు సూచించినట్లు తెలిసింది. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించాలంటూ కొందరు శాసనసభ సభ్యులు, పార్లమెంటు సభ్యులు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకురావడం కాంగ్రెస్ అధినాయకత్వానికి ఎంత మాత్రం నచ్చడం లేదు.
News Posted: 7 September, 2009
|