డెత్ 'బెల్' బావుందా? హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ప్రయాణించిన హెలికాప్టర్ - బెల్ - 430 ప్రమాదానికి గురైన ఉదంతంలో పైలట్లు ఇద్దరూ కూడా అనుభవజ్ఞులేనని పౌరవిమానా శాఖ డైరెక్టరేట్ (డీజీపీఏ) వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నల్లమల వంటి దట్టమైన అడవుల్లో, ప్రతికూల వాతవరణ పరిస్థితుల్లో ప్రయాణించడం పైలట్ సునీల్ కుమార్ భాటియాకు కొత్తకాదు. అరుణాచల్ ప్రదేశ్ లో ఆయన 12 ఏళ్ళు పనిచేశారని ఈ వర్గాలు చెబుతున్నాయి. ప్రమాదంపై దర్యాప్తులో పాల్గొన్న అధికార వర్గాలు - మానవ తప్పిదం కారణంగా ప్రమాదం జరగలేదని భావిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. హెలికాప్టర్ 8 వేల అడుగుల ఎత్తు వరకు వెళ్ళి ప్రయాణించగలదు. ప్రమాదానికి గురైనప్పుడు కూడా వీఎఫ్ ఆర్ (విజువల్ ఫ్లైట్ రూల్స్) కు అనుగుణంగానే 5 వేల అడుగుల ఎత్తులో హెలికాప్టర్ ప్రయాణిస్తోంది. ఈ పరిస్థితులు వాతావరణం ప్రతికూలతతో పాటు ఏదో సాంకేతిక సమస్య ఉన్నట్లు అనుమానాలకు దారి తీస్తోంది.
పైలట్ భాటియా బయలుదేరేముందు హైదరాబాద్, చిత్తూరుల్లో వాతావరణ పరిస్థితులను వాకబు చేశారు. ఈ రాష్ట్రంలో హెలికాప్టర్ లోని భాగాలు అన్నీ కూడా 'మంచిస్థితి'లో ఉన్నాయా లేదా అన్నదానిపై డీజీసీఏ దృష్టి పెట్టింది. హెలికాప్టర్ జాడ తెలియకుండా పోయిన రోజున - విడుదల చేసిన ప్రకటనను - ఆంధ్రప్రదేశ్ విమాన సంస్థ (ఏపీఏసీ) ఉపసంహరించింది. 'ఇద్దరు పైలట్లు అనుభవజ్ఞులే - హెలికాప్టర్ కు ప్రమాదం జరిగితే - అలెర్ట్ చేయడానికి 'ఎమర్జెన్సీ లొకేటర్ ట్రాన్స్ మీటర్' ఉంది' అని సెప్టెంబర్ 2న ఏపీఏసీ ప్రకటించింది. ఏపీఏసీలో అవినీతి గురించి వెల్లడించిన భాటియాపై వేధింపులు జరిగాయన్న అంశాన్ని భారత వైమానిక దళం (ఐఏఫ్) పరిశీలిస్తోంది. ప్రమాదానికి కొద్ది రోజుల ముందుగా 'పరిస్థితి'ని వివరించేందుకు ఐఏఎఫ్ కు చెందిన హైదరాబాద్ కమాండింగ్ ఆఫీసర్ తో మాట్లాడతానని భాటియా పేర్కొన్న విషయం గమనార్హం.
News Posted: 8 September, 2009
|