ఇప్పట్లో సీఎల్ పీ లేనట్టే! న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి వైఎస్ వారసుని 'ఎన్నిక' నిర్వహించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్ పీ) సమావేశమయ్యే అవకాశాలు సమీప భవిష్యత్ లో కనిపించడం లేదు. వైఎస్ ఆత్మబంధువు కేవీపీ రామచంద్రరావు మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో గంటన్నర పైగా సమావేశమయ్యారు. ఆమెతో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను చర్చించిన అనంతరం కేవీపీ విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎవరన్నది సోనియాగాంధీయే నిర్ణయిస్తారని చెప్పారు. వైఎస్ భార్య కోలుకున్నారా అంటూ క్షేమ సమాచారాలు మేడం అడిగినట్లు తెలిపారు. విశ్వసనీయవర్గాల ప్రకారం సీఎల్ పీ భేటీ ఇప్పట్లో జరగకపోవచ్చు - ఒక వేళ జరిగినా... 'ముఖ్యమంత్రి ఎంపిక అంశాన్ని సోనియాగాంధీ నిర్ణయానికే వదిలి వేస్తున్నట్లు'గా ఒక తీర్మానాన్ని ఆమోదించడం వరకే సీఎల్ పి పరిమితం అవుతుంది.
వైఎస్ వారసుడు జగన్ ను సీఎం చేయాలన్న వాదనను ఏఐసీసీ వర్గాలు కొట్టిపారేయడం లేదు. రాష్ట్ర ప్రజల్లో వైఎస్ కు ఉన్న ఆదరాభిమానాలను, కాంగ్రెస్ కు ఆయన చేసిన సేవలను అధిష్టానం తృణీకరించే పరిస్థితి లేదని తెలుస్తోంది. సంతాపదినాలు పూర్తయ్యాక ముఖ్యమంత్రి ఎన్నిక అంశంపై దృష్టి పెడతామన్న నాయకత్వం రాష్ట్రంలో 'అధికారం - పంపిణీ' పై దృష్టి పెట్టవచ్చు. కేంద్రంలో రెండు అధికార కేంద్రాలు... సోనియా - మన్మోహన్ తీరుగా రాష్ట్రంలో కూడా బాధ్యతల పంపకం జరిగే అవకాశం లేకపోలేదు.
అవసరమైతే జగన్ కు కేంద్ర మంత్రి పదవి, లేదా డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టవచ్చు లేదా పీసీసీ అధ్యక్షునిగా నియమించవచ్చునని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ సీఎంగా జగన్ ను అధిష్టానం ఎంపిక చేయని పక్షంలో వైఎస్ వర్గీయుల మద్దతుతో నూతన 'అభ్యర్థి'ని తెరపైకి తెచ్చినా ఆశ్చర్యం లేదు. కేవీపీతో జగన్ కు మద్దతునిచ్చే పలువురు సమావేశమయ్యారు. రెండు రోజులు ఢిల్లీలో ఉండాలని కేవీపీని ఆదేశించిన అధిష్టానం - జగన్ కు మద్దతుగా ఎవరినీ కలిసేందుకు సోనియా సిద్ధంగా లేరని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. అధిష్టానం పిలవకుండానే ఢిల్లీ వచ్చిన వర్గాలన్నీ తమ అభిప్రాయాల్ని రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి వీరప్ప మొయిలీకి తెలుపుతున్నారు.
News Posted: 9 September, 2009
|