'పొదుపు'పై పెదవి విరుపు న్యూఢిల్లీ : పొదుపు మంచిదే... అయితే, దానితో సర్దుకుపోగలగాలి. లావుగా ఉన్న వ్యక్తికి ఒక విమానం ఎకానమీ క్లాస్ లో 'మధ్య సీటులో ఇరుక్కుని కూర్చోవలసిన' పరిస్థితి రావడం 'ఇబ్బందికరం' కాదా? కేంద్ర మంత్రివర్గం గురువారం సమావేశమై విఐపి ప్రయాణాలపై ఖర్చు తగ్గించడం గురించి చర్చించినప్పుడు శరద్ పవార్ అడిగిన ప్రశ్న ఇది. ఇక డాక్టర్ ఫరూక్ అబ్దుల్లాది మరొక సమస్య . మీరు పొడగరి అయి, కాళ్ళు జాపుకోవడానికి ఎక్కువ స్థలం అవసరమైనప్పుడు ఏమి చేస్తారు అని ఆయన అడిగారు.
తమ దృక్కోణంలో నుంచి వారు ఈ విధంగా ఆందోళనలు వ్యక్తం చేశారని ఎవరైనా గ్రహిస్తారు. అయితే, ప్రణాళికేతర వ్యయంలో ఆర్థిక మంత్రిత్వశాఖ ఐదు శాతం కోత విధించడంపై చాలా మంది మంత్రులు గుసగుసలాడుకున్నట్లు తెలుస్తున్నది. దేశీయ, విదేశీ ప్రయాణాలకు కూడా ఇది వర్తిస్తుంది. ఎకానమీ క్లాస్ లో ప్రయాణించడమంటే మంత్రులకు సమస్యేనని పవార్ అన్నారు. చాలా సంవత్సరాల క్రితం తాను రక్షణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో వై క్లాస్ లో దేశం నుంచి విమానంలో ప్రయాణించినప్పుడు తన ఆతిధేయులు విమానం చివరి భాగంలో ఉన్న తనను గుర్తించడానికి ఏవిధంగా 'కష్టపడ్డారో' ఆయన ఈ సమావేశంలో వివరించారు.
ఎక్కువగా విమాన ప్రయాణాలు చేస్తుండే, అంటే వారంలో కనీసం సగం రోజులు విదేశాలలో గడుపుతుండే మంత్రులు అటు స్థూలకాయుడూ, ఇటు పొడగరీ కాని ప్రణబ్ ముఖర్జీ సోమవారం సూచించిన పొదుపు చర్యలు ఎలా 'ఆచరణసాధ్యమో' తమకు అంతుపట్టడం లేదని అన్నారు. 'చిన్న చిన్న నీటి బొట్లతో ప్రయోజనం ఉండదు కదా' అని ఒకరు వ్యాఖ్యానించారు. విదేశీ యాత్ర సమయంలో దిన భత్యంగా 'ఎప్పుడో నిర్ణయించిన' 75 డాలర్లు సరిపోదని ఆయన వాదించారు. కార్గిల్ యుద్ధం సమయంలో తగ్గించిన ఈ భత్యాన్ని 100 డాలర్లకు ప్రభుత్వం ఎందుకు పునరుద్ధరించదని ఆయన అడిగారు. 'అత్యల్ప' అలవెన్సు వల్ల తాము భోజనం కోసం 'ఎప్పుడూ స్థానిక ఆతిథ్యం కోసం చూడవలసి' వస్తున్నదని మరికొందరు చెప్పారు.
పవార్ వాదన ముగియలేదు. ఇండియాలో విలాసవంతమైన హోటళ్ళలో విదేశీ ప్రతినిధుల కోసం మంత్రులు సమావేశాలను నిర్వహించవలసి వచ్చినప్పుడు ఖర్చులు తగ్గించడానికి తాము లంచ్ ఏర్పాటు చేయరాదనేది ఆర్థిక శాఖ మంత్రి అభిప్రాయమా అని పవార్ ప్రశ్నించారు. ఇందుకు ప్రణబ్ ముఖర్జీ సమాధానం ఇస్తూ, ఆర్థిక వ్యవస్థ తొమ్మిది శాతం మేర వృద్ధి చెందుతున్నప్పుడు 'కొంత అధిక వ్యయాన్ని' అనుమతించవచ్చునని, కాని ఇప్పుడు కాదని అన్నారు.
News Posted: 11 September, 2009
|