ఛానళ్ళ పైనే జనం కళ్ళు హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి సంబంధించిన వార్తా విశేషాల ప్రసారం టెలివిజన్ ఛానళ్ళ టీఆర్పీ రేటింగ్ ని విపరీతంగా పెంచింది. ప్రాంతీయ భాషా ఛానళ్ళు అన్నింటికీ ఈ ఏడాది ఇదే అతి పెద్ద కార్యక్రమంగా ఉంది. వైఎస్ అదృశ్యం మొదలు, ప్రమాదం నిర్ధారణ, మృతదేహాన్ని హైదరాబాద్ కు తీసుకురావడం, అంతిమయాత్ర, అంత్యక్రియల వరకు టెలివిజన్ ఛానళ్ళు పోటీపడి మూడురోజుల పాటు చేసిన 'ప్రత్యక్ష ప్రసారాల'ను ప్రేక్షకులు తిలకించారు. ఆ మాటకొస్తే వైఎస్ అంత్యక్రియల అనంతరం కూడా ఆయన అమలు చేసిన ప్రభుత్వ పథకాల గురించి నివాళిగా ఇచ్చిన కథనాలకు కూడా తెలుగు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. తెలుగు వార్తా ఛానళ్ళు మూడు రోజులు వరుసగా వైఎస్ సంబంధిత వార్తలను ప్రసారం చేస్తే, జాతీయ టెలివిజన్లు కూడా వరుసగా రెండురోజులు వైఎస్ వార్తలకు ప్రాధాన్యత ఇచ్చాయి. వినోదపు ఛానళ్ళకన్నా వైఎస్ వార్తలను ప్రసారం చేసిన వాటికే ఎక్కువ టీఆర్పీ రేటింగ్ లభించింది. కొన్ని ఛానళ్ళ 48 గంటలపాటు, మరికొన్ని ఛానళ్ళు 60 గంటల పాటు 'వైఎస్ గల్లంతు - మృతి' వార్తలను ప్రసారం చేశాయి.
ప్రాంతీయ ఛానళ్ళ రిపోర్టర్లు ఇచ్చిన కథనాల ఆధారంగానే జాతీయ ఛానళ్ళు కూడా తమ ప్రసారాలు చేశాయి. ప్రతి వార్తా ఛానెల్ వైఎస్ సంబంధిత వార్తలకోసం రేయింబవళ్ళు పనిచేసేందుకు వీలుగా 12 మందికి పైగా విలేఖర్లు బృందాన్ని నియమించాయి. సెప్టెంబర్ 2 నుంచి 4వ తేదీవరకు దాదాపు అన్ని ఛానళ్ళు ప్రత్యక్ష ప్రసారాలే చేశాయి. వైఎస్ కు ప్రమాదం సంఘటన ప్రాముఖ్యత దృష్ట్యా - ఏటా ఛానళ్ళు పోటీ పడి ప్రత్యక్ష ప్రసారం చేసే 'గణేష్ నిమజ్జనం'ను ఏ ఛానల్ కూడా పట్టించుకోలేదు. సెప్టెంబర్ 5తో అంతమయ్యే వారాంతానికి తెలుగు వార్తా ఛానెళ్ళ రేటింగ్ శాతం పెరిగింది. ఛానళ్ళ వారీగా టీవీ9, సాక్షి - 60 గంటలు, ఐ న్యూస్ - 62 గంటలు, ఈటీవీ 2 - ఎన్ టీవీ, జీ టీవీ 24 గంటలు, టీవీ 5, హెచ్ ఎంటీవీలు 48 గంటల వంతున వైఎస్ గల్లంతు - మృతి వార్తలను ప్రసారం చేశాయి. స్థానికంగా ఎన్నికలపుడు ఎక్కువగా టీవీ ప్రత్యక్ష ప్రసారాలను ప్రేక్షకులు చూస్తారు. ఆ సమయంలో కూడా ఫలితాల రోజునే రేటింగ్ బాగా ఉంటుంది. కానీ వైఎస్ వార్తలపై ఆద్యంతం ప్రేక్షకులు ఆసక్తి చూపారంటే అతిశయోక్తి కాదు!
News Posted: 11 September, 2009
|