'ఇంజనీరింగ్' సిబిఐ దాడులు హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలపై ఒక పక్క సిబిఐ దాడులు మరో పక్క ఆదాయపన్ను శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించడంతో యాజమాన్యాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఏఐసీటీఈ సభ్య కార్యదర్శి నారాయణరావుకు ముడుపులు సమర్పించి అత్యధిక కాలేజీలు అక్రమంగా అనుమతులు సాధించాయని తెలియడంతో సీబీఐ ఈ దాడులు చేస్తోంది. వాస్తవానికి దేశవ్యాప్తంగా వృత్తి, సాంకేతిక విద్యాసంస్థలపై సిబిఐ దాడులు కొనసాగిస్తోంది. తమిళనాడు, మైసూర్, ముంబై, పూనేలతో పాటు హైదరాబాద్ లో ఆకస్మిక తనిఖీలు, దాడులు కొనసాగుతున్నాయి.
పదిహేను రోజుల కిందట రాష్ట్రంలో 15 కాలేజీలపై సిబిఐ దాడులు చేయగా, గురువారం నాడు తాజాగా మరో ఐదు కాలేజీలపై సిబిఐ దాడులు నిర్వహించింది. అదే సమయంలో ఆదాయపన్నుశాఖ అధికారులు సైతం యాజమాన్యాల రికార్డులను పరిశీలిస్తున్నాయి. జె.భాస్కరరావు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ యాజమాన్యంపై సిబిఐ దాడులు చేసింది. 1993లోసాధారణ న్యాయవాది ఈ 15 ఏళ్ళ కాలంలో వందల కోట్ల రూపాయిలకు పడగలెత్తడంపై సిబిఐ రికార్డులను స్వాధీనం చేసుకుని పరిశీలనలు జరుపుతోంది. 1993లో సొసైటీ ఏర్పాటు చేసి తొలుత హోటల్ మేనేజిమెంట్ అండ్ కేటరింగ్ కాలేజీ నడిపిన జె.భాస్కరరావు తర్వాతతర్వాత ఇంజనీరింగ్, సైన్స్, మెడికల్, మేనేజిమెంట్, డెంటల్, ఫార్మసీ కాలేజీలను ప్రారంభించారు. మొయినా బాద్ మండలం ఎంకపల్లిలో 30 ఎకరాల విస్తీర్ణంలో వీటిని ప్రారంభించారు. రోడ్ నెంబర్-1లోని భాస్కర ప్లాజా ఆయనదేనని చెబుతున్నారు. ఈ ఆస్తులపై లెక్కలు తేల్చాల్సిందిగా సిబిఐ అధికారులు నిలదీస్తున్నారు.
అలాగే సీబీఏ శ్రీనిధి, ఎంవిఎన్ ఆర్, సిబిఐటి, జెబిఐటి యాజమాన్యాలపై కూడా ఈ దాడులు కొనసాగినట్లు చెబుతున్నారు. అయితే సిబిఐ నుండి ఈ దాడులకు సంబంధించి ఎలాంటి నిర్ధారణ జరగలేదు. దాడులపై మాట్లాడేందుకు సిబిఐ అధికారులు నిరాకరించారు. తాము మొత్తం పరిశీలనలు పూర్తయ్యేంత వరకూ ఏమీ చెప్పలేమని వ్యాఖ్యానించారు. గ్రూప్ కాలేజీలు ఉన్న అన్ని విద్యాసంస్థలపైనా దాడులు కొనసాగుతున్నట్లు తెలిసింది. కొన్ని యాజమాన్యాల ఆధీనంలో 10 నుండి 20 కాలేజీలు ఉన్నాయి. ఇలాంటి యాజమాన్యాల సంఖ్య దాదాపు రెండు డజన్ల వరకూ ఉంది. ఈ యాజమాన్యాల కమిటీల్లోని సభ్యులు చాలా మంది అస్సలు పాన్ కార్డు కూడా తీసుకోని వారు ఉన్నారని చెబుతున్నారు. పాన్ కార్డ్ తీసుకోకున్నా, లక్షలాది రూపాయిల కాలేజీల ఏర్పాటుకు వెచ్చిస్తూ, బ్యాంకుల నుండి రుణాలు పొందడం సిబిఐ అధికారులను ఆశ్చర్యపరుస్తోంది.
News Posted: 11 September, 2009
|