గగనంలో సీఎంకు భద్రత లేదా! హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ప్రయాణించిన హెలికాప్టర్ ప్రమాదానికి గురైన నేపథ్యంలో ముఖ్యమంత్రికి కల్పించే భద్రత చర్చకు దారితీసింది. ఈ నెల రెండున ముఖ్యమంత్రి వైఎస్ బేగంపేట విమానాశ్రయంలో ఉదయం 8-38 గంటలకు బెల్-430 హెలికాప్టర్ లో బయలుదేరిన అనంతరం నల్లమల అడవుల్లో జరిగిన ప్రమాదంలో దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఇటీవల హోమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నాతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 'ఒకసారి ముఖ్యమంత్రి ఆకాశమార్గం పట్టాక ఆయన భద్రత విషయంలో పోలీసులకు బాధ్యత లేదు' అని డీజీపీ ఎస్ ఎస్ పీ యాదవ్ స్పష్టం చేయడం పలు వర్గాల్లో ఆగ్రహాన్ని కలిగించింది. ఈ దురదృష్టకర సంఘటనలో తమ నాయకుణ్ణి కోల్పోయామని ఆవేదన చెందుతున్నవారిని యాదవ్ వ్యాఖ్యలు మరింత కలచివేశాయి. సీపీఐ కార్యదర్శి నారాయణ అయితే... 'నేనే హోమంత్రినైతే... యాదవ్ - నిజంగా ఆమాటలు అనివుంటే ఆయన నోరు దబ్బనంతో కుట్టేస్తా' అని వ్యాఖ్యానించారు. నిజానికి ముఖ్యమంత్రి గల్లంతు అయిన విషయం ఆ రోజు ఉదయం 11 గంటల వరకు డీజీపీ యాదవ్ కు తెలియకపోవడానికన్నా మించిన విషాదం ఏముంది?
'జరిగింది... దురదృష్టకర సంఘటన... ఆకాశమార్గంలో సీఎం గల్లంతైన సంఘటన ఇంతకుముందెప్పుడూ జరగలేదు. ఇకపై ఇలా జరగకుండా ముఖ్యమంత్రికి భద్రతపై విధి విధానాలు రూపొందించాల్సి ఉంది' అని వివరించాల్సిన డీజీపీ... తమకు బాధ్యతలేదని ప్రకటించడాన్ని పలువురు రిటైర్డ్ అధికారులు కూడా ఖండిస్తున్నారు. 'ఏటీసీతో పోలీసులకు సంబంధాలు ఇంతకుముందు లేని మాట నిజమే. అయితే గగన తల ప్రయాణ నియంత్రణ కేంద్రం (ఏటీసీ)తో లేదా పౌరవిమాన శాఖ డైరక్టరేట్ (డీజీసీఏ) తో సంబంధాలు పెట్టుకోవద్దని ఎవరన్నా అడ్డుకున్నారా?' అని మాజీ సీబీఐ డైరక్టర్, తెలుగుదేశం నాయకుడు విజయరామారావు పేర్కొన్నారు. వాస్తవానికి నక్సల్స్ కదలికలు ఉన్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గంలోని జిల్లాల పోలీసు అధికారులకు సమాచారం అందాల్సి ఉంది. ముఖ్యమంత్రికి కల్పించే భద్రత గురించి రాష్ట్రంలో చర్చకు వైఎస్ మృతి దారితీసింది. ఇదే సమయంలో సీఎం భద్రతపై డీజీపీ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఆయన పదవికి ఎసరు తెస్తున్నట్టు మీడియా కథనాలు సూచిస్తున్నాయి. యాదవ్ ను తప్పించాలని సీఎం రోశయ్య ఇప్పటికే నిర్ణయించారని వినికిడి!
News Posted: 12 September, 2009
|