తెరాస 'ఠీవి' హైదరాబాద్ : గత ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన 'మహాకూటమి' భాగస్వామి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రజా సమస్యలపై ఉద్యమించి... సంస్థాగతంగా బలోపేతం కావాలని భావిస్తోంది. ఈ నెల 17న తెలంగాణలోని పల్లెల్లో 'హైదరాబాద్ విమోచన దినం'ను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులను రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది. రాష్ట్ర కాంగ్రెస్ లో జరిగిన పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న తెరాస... కాంగ్రెస్ నుంచి తమకు ఏ ఇబ్బందీ ఎదురు కాకపోవచ్చునని భావిస్తోంది.
2004 ఎన్నికల్లో కాంగ్రెస్, 2009 ఎన్నికల్లో తెలుగుదేశం తమను దెబ్బతీసినట్లు తెరాస శ్రేణులు పేర్కొంటున్నాయి. ఈ కారణంగానే ఇకపై ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకూడదని తెరాస నిర్ణయించింది. దేవేందర్ గౌడ్, ఇతర భాజపా, తెరాస నాయకులు కొందరు తిరిగి తెలుగుదేశంలోకి 'స్వగృహ' ప్రవేశం చేశారు. ఇటీవల సమావేశమైన తెరాస పొలిట్ బ్యూరో సమావేశం తెలుగుదేశం ఎత్తుగడలను తిప్పికొట్టాలని తీర్మానించింది.
అదే విధంగా తెలంగాణ ఉద్యమానికి అండదండలు ఇచ్చేందుకు, తెలంగాణ సంస్కృతి పరిరక్షణకు - తెలంగాణ టీవీ ఛానెల్ ప్రారంభించాలని తెరాస నాయకత్వం భావిస్తోంది. ఈ నెల 9వ తేదీ 9.33 గంటలకు తనకు పట్టిన ఏలిననాటి శని వదిలిందని, తనకూ, పార్టీకి ఇక మంచిరోజులు వస్తాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ వ్యాఖ్యల నుంచి ఏమేరకు తెరాస కార్యకర్తలు 'స్ఫూర్తి' పొందుతారో చూడాలి!
News Posted: 14 September, 2009
|