'స్వచ్ఛంద' పీహెచ్ సీలు! హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్ సీ) నిర్వహణనను స్వచ్ఛంద సంస్థలకు, ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించనుంది. రానున్నకాలంలో దశలవారీగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వం సమ్మతిస్తే రాష్ట్రంలోని 1571 పీహెచ్ సీలు ఇక ప్రైవేట్ పరం అవుతాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఇటీవల నిర్వహించిన సర్వేలో 80 శాతం పీహెచ్ సీలు సరిగ్గా పని చేయడం లేదని తేలింది. సిబ్బంది కొరత, పనిచేయాని వైద్య యంత్ర పరికరాలతో ఈ పరిస్థితి దాపురించిందని సర్వే చెప్పింది.
జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్ (ఎన్ ఆర్ హెచ్ఎం) కేంద్ర మంత్రి పీహెచ్ సీకి ఇస్తున్న 1.90 లక్షల రూపాయలతో మౌలిక వసతులు పెంచుకోవాలి. కానీ ఆచరణలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. పీహెచ్ సీల కోసం ప్రభుత్వం ఎన్ని నిధులు వ్యయం చేస్తున్నా... డయేరియా వంటి వ్యాధుల నియంత్రణలో కూడా తోడ్పడడం లేదన్నది ప్రభుత్వవాదన. ఈ క్రమంలో అనంతపురం జిల్లాలో గుదిబండలో పీహెచ్ సీని స్వామివివేకానంద ఇంటిగ్రేటెర్ రూరల్ సెంటర్ నిర్వహిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ మండలం లింగాపూర్, నార్నూర్ మండలం, గాంధీగూడలోని పీహెచ్ సీలను కరుణ ట్రస్ట్ నిర్వహిస్తోంది. ఈ రెండు జిల్లాల్లో 'ప్రైవేట్'కు ప్రయోగాత్మకంగా ఇచ్చిన పీహెచ్ సీలు బాగా పనిచేస్తుండడంతో ప్రభుత్వం ప్రైవేట్ వైపునకు మొగ్గుతోంది.
గిరిజన ప్రాంతాల్లో 58 వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 259 సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, 76 సివిల్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి అర్హులైనవారు రావడం లేదన్నది ప్రభుత్వ వివరణ. అయితే... ప్రజలకు అవసరమైన వైద్యాన్ని ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయ్తనం భవిష్యత్ లోదుష్పరిణామాలకు దారితీస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోగం ఒకటైతే మందొకటిగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు.
News Posted: 15 September, 2009
|