ఆకలి ప్రపంచం లండన్ : ఇది ఆకలి ప్రపంచం... కూటికి మొహం వాసిపోతున్న కటిక దరిద్రులు ధరిత్రి నిండా నిండిపోతున్నారు. ప్రపంచంలో కరవు కరాళనృత్యం చేస్తోంది. ఆహార ధాన్యాల కొరత పట్టి పీడిస్తోంది. కనీసం గుప్పెడు మెతుకులు తినడానికి కూడా ఠికాణా లేని దౌర్బాగ్యపు ఆర్ధికమాన్యం పేదవాణ్ణి దీనునిగా మార్చి వేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా గత ఇరవై ఏళ్ళలో ఎన్నడూ లేని విధంగా ఆహార కొరత ఏర్పడింది. దానితో పాటు అన్నార్తుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయంది. ఈ వాస్తవాలను ఐక్యరాజ్య సమితి సహాయ విభాగం వెల్లడించింది. ఆకలితో అలమటించి పోతున్న వారి సంఖ్య ఈ ఏడాది పది కోట్లకు పైగా మించిపోయిందని ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార సరఫరా విభాగం వెల్లడించంది. దాంతో ఐక్యరాజ్య సమితికి తీవ్రమైన నిధుల కొరత ఏర్పడిందన్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుంగిపోవడంతో ఆహార పదార్ధాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, కోట్లాది మందికి కొనుగోలు శక్తి పడిపోయిందని పేర్కొంది. అలానే వాతావరణంలో వచ్చిన పెను మార్పుల వల్ల కరవు పరిస్థితులు ఏర్పడి ప్రజలకు ఆకలి బాధను మిగిల్చాయని వివరించింది. ఆఫ్రికా సహారా ఎడారి ప్రాంతంలోను, దక్షిణాసియా ఖండంలోనూ ఆహార ధాన్యాల కొరత చాలా ఎక్కువగా ఉందని తెలిపింది. అమెరికా, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, చెక్ రిపబ్లిక్ లోమాత్రం ఆహార పదార్ధాల లభ్యత సాధారణంగా ఉందని తెలిపింది. ప్రస్తుతం ప్రపంచంలో ఏర్పడిన ఆహార కొరత కారణంగా కోటి మంది ఆకలితో బాధపడుతున్నారన్నారు. దక్షిణాసియాలోని పాకిస్తాన్ తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటుందని ఈ జాబితాలో భారత్, బంగ్లాదేశ్ లు కూడా ఉన్నాయని ఐక్యరాజ్య సమితి నివేదిక వివరించింది. ప్రపంచంలో భారతదేశం ఆర్థికంగా బలపడుతున్న దేశంగా అవతరిస్తున్నప్పటికీ ప్రజలందరికీ ఆహారాన్ని అందించే అంశంలో తీవ్రమైన ఒత్తిడులకు గురౌతుందని పేర్కొంది. చైనా, రష్యా, బ్రెజిల్ దేశాలు కాస్త మెరుగ్గా ఉన్నాయని వివరించింది.
News Posted: 17 September, 2009
|