ఆరెస్సెస్ దీపావళి కానుక న్యూఢిల్లీ : ఈ సంవత్సరం దీపావళికి మీ ప్రాంతంలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్త ఎవరైనా ఒక విలక్షణ కానుక ఇస్తే ఆశ్చర్యపోకండి. గోమాతల పట్ల పవిత్ర భావనతో ఆర్ఎస్ఎస్ గోమూత్రం, పేడ, పాలు, నెయ్యి, పెరుగు వంటి ఉత్పత్తులతో తయారు చేసిన లక్ష్మీదేవి, వినాయక విగ్రహాలను ఈ పండుగ సీజన్ లో కానుకలుగా అందజేయాలని నిశ్చయించింది. 'ఎక్కడ వీలైతే అక్కడ ఈ విగ్రహాలను ఉపయోగించవలసిందిగా స్వయంసేవక్ లను కోరడమైనది. ఈ ఉద్యమానికి ఈ దఫా గౌరవనీయంగా నాంది పలకాలని, మున్ముందు దీనిని మరింత విస్తృతం చేయాలని మా భావన' అని ఇంద్రప్రస్థ విశ్వ సంవాద్ కేంద్ర (ఆర్ఎస్ఎస్ మీడియా విభాగం) కార్యదర్శి వాగీశ్ ఇస్సార్ తెలియజేశారు.
ఇందుకు వ్యూహరచన ఈ సంవత్సరం ప్రథమార్ధంలో జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 60 మంది శిల్పులకు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్త అఖిల భారతీయ గో రక్ష సమితి కాన్పూర్ లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. గోమూత్రం, పేడ, పాలు, నెయ్యి, పెరుగును ఏయే పాళ్ళలో కలిపితే రమణీయమైన దేవుళ్ళు, దేవతల విగ్రహాలకు రూపకల్పన చేయవచ్చునో వారికి విశదపరిచారు. ఇటువంటి విగ్రహాలను ఈ దీపావళికి ఉపయోగించాలని, ఇతరులకు పంపిణీ చేయాలని తన కార్యకర్తలను ఆర్ఎస్ఎస్ కోరింది. ఈ సంస్థ ఇందుకు పూనుకోవడంలో రెండు అంశాలు ఇమిడి ఉన్నాయి. వాటిలో ఒకటి జాతీయవాదం కాగా రెండవ ఆర్థికపరమైనది. ఇలా చేయడం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించవచ్చునని ఆర్ఎస్ఎస్ భావిస్తున్నది.
వీటిలో జాతీయవాదానికి సంస్థ ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నది. దైవ ప్రతిమలను చైనాలో తయారు చేసి ఇండియాలో విక్రయించడమనే భావన హిందూ విశ్వాసాలకు విరుద్ధమైనదని ఆర్ఎస్ఎస్ అభిప్రాయం. ఈవిధమైన వ్యాపారం ద్వారా చైనీయులు సంపన్నులు అవుతున్నారని సంస్థ పేర్కొంటున్నది. ఆర్థికపరమైనది రెండవ అంశం. ఇటువంటి ముడి వస్తువులపై ఆధారపడిన దేశంలోని కుటీర పరిశ్రమలు చైనా ఉత్పత్తి సంస్థలకు బలమైన ప్రత్యర్థులుగా నిలబడగలవు. పర్యావరణానికి సమస్య కాగల పదార్థాలతో తయారు చేసిన విగ్రహాలను చైనీయులు ఈ దేశంలో కుప్పతెప్పలుగా అమ్ముతున్నారని సంస్థ ఆరోపిస్తున్నది. ఇటువంటి దేశీయ ఉత్పత్తుల విక్రయం ద్వారా గ్రామాలు సుసంపన్నమై దేశం ఆర్థికంగా వృద్ధి సాధించగలదు.
'దుర్భిక్షంతో బాధ పడుతున్న, రుణాలు తిరిగి చెల్లించలేక తిప్పలు పడుతున్న రైతులు తమ వద్ద ఉన్న ఆవులు పాలు ఇవ్వడం మానివేసిన తరువాత వాటిని కబేళాలకు అప్పజెప్పుతున్నారు' అని ఇస్సార్ చెప్పారు. 'మనం ఈ విగ్రహాలను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చినట్లయితే ఆ ఆవుల పేడ, మూత్రాన్ని ముడి పదార్థాలుగా ఉపయోగించవచ్చు. వాటిని విక్రయించవచ్చు' అని ఆయన సూచించారు.
News Posted: 18 September, 2009
|