తెరాసలో అర(గో)విందం! హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితిలో తలెత్తిన సంక్షోభం సమసిన సూచనలు కనిపించడం లేదు. పార్టీని ఉద్యమబాట పట్టించేందుకు ఇటీవల కేసీఆర్ 'పల్లెబాట' కార్యక్రమాన్ని నిర్వహించారు. తనకూ, పార్టీకి పట్టిన ఏలిననాటి శని ఈనెల 9వ తేదీ 9-33 గంటలకు పోయిందని - వచ్చేదంతా మంచి కాలమేనని కూడా ప్రకటించారు. ఇంతలోనే మంచిర్యాల శాసనసభ్యుడు అరవింద్ రెడ్డి - తెరాస నాయకత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపించారు. 'హైదరాబాద్ విమోచనం' సందర్భంగా ఒక టీవీ కార్యక్రమంలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన... తెరాస రాజకీయ పార్టీ - ఉద్యమ సంస్థగా మారడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. 2004 ఎన్నికల్లో 26 శాసనసభా స్థానాలు, 5 లోక్ సభ స్థానాలు గెలిచిన తెరాస - 2009 ఎన్నికల్లో 10 శాసనసభ స్థానాలకు పడిపోయిందని గుర్తు చేశారు. పార్టీ తన వైఖరిని సవరించుకోకపోతే ఐదు స్థానాలను కూడా గెలుచుకోలేదని హెచ్చరించారు.
గతంలో అరవింద్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ తో సమావేశమయ్యారు. దీంతో ఆయన కాంగ్రెస్ బాట పడతారన్న ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ తాను తెరాసకే అంకితమైన వ్యక్తినని తెలిపారు. పార్టీ విధానాల్ని మార్చడానికి తనవంతు ప్రయత్నం చేస్తారన్నారు. దివంగత వైఎస్ తో రెండుమార్లు భేటీయై పార్టీపై తిరుగుబాట బావుటా ఎగురవేసిన ఎంపీ విజయశాంతికి ఒక కుంభకోణంతో సంబంధం ఉన్నట్లుగా ఆరోపణలు రావడంతో తెరాస వర్గాలు కొంత మేరకు ఊరట చెందాయి. కానీ ఇంతలోనే శాసనసభ్యుడు అరవింద్ రెడ్డి తిరుగుబాటు చేయడం... తెరాసలో ఇంకా పరిస్థితి కుదుటపడలేదనడానికి సంకేతమేనని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
News Posted: 18 September, 2009
|