వాయిదాల ప్రాజెక్ట్! హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కేంద్రంలో తన పరపతి వినియోగించి రాష్ట్రానికి తీసుకువచ్చిన మన్నవరం ప్రాజెక్ట్ కు ఆటంకాలు ఇంకా తొలగలేదు. 6 వేల కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్ట్ ను చిత్తురు జిల్లా మన్నవరం వద్ద ఎన్ టీపీసీ - భెల్ కలిసి నెలకొల్పుతున్నాయి. ఈ నెల 20 లోగా జరగాల్సిన శంకుస్థాపన మరోసారి వాయిదా పడింది. ఈ ప్రాజెక్టుకు తొలి నుంచి ఆటంకాలు ఎదురౌతూనే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ స్థాపనకు మన్నవరాన్ని కేంద్రం ఎంపిక చేయగానే రాజస్థాన్ ప్రభుత్వం అభ్యంతరం పెట్టింది. దీంతో ఈ ప్రాజెక్ట్ స్థాపనకు ఏపీ, రాజస్థాన్ ల్లో ఏది అనువైన రాష్ట్రమో నిర్ణయించేందుకు సాంకేతిక కమిటీని నియమించారు.
ప్రాజెక్ట్ కు ఏపీ అనుకూలమని కమిటీ నిర్ణయించాక సెప్టెంబర్ 5, 6 తేదీల్లో ప్రధాని శంకుస్థాపన చేస్తారని భావించారు. ఈ సందర్భంలోనే తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా ప్రధాని శంకుస్థాపన చేయాల్సి ఉంది. అయితే, విమానాశ్రయానికి ఇంకా ఆర్థికపరమైన చిక్కులు తొలగలేదు. ఈ క్రమంలో ఎన్ టీపీసీ, భెల్ ఆధ్వర్యంలోని మన్నవరం పరిశ్రమకు ఈనెల 17న శంకుస్థాపన చేసేందుకు ప్రధాని షెడ్యూల్ ఖరారైంది. అయితే, వైఎస్ ఆకస్మిక మృతితో ప్రధాని పర్యటన మళ్ళీ వాయిదా పడింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి విషయంలో గందరగోళం తగ్గితే.. మరో సారి శంకుస్థాపన తేదీ ఖరారయ్యే అవకాశం ఉంది.
News Posted: 19 September, 2009
|