ఆర్టీసీ దసరా దోపిడి హైదరాబాద్ : రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ (ఆర్టీసీ) పండగ పేరుతో ప్రయాణికులను నిలువుదోపిడీ చేస్తోంది. ఇందుకోసం పండగ సీజన్ లో 30 నంచి 50 శాతం మేరకు అధనపు ఛార్జీలను ప్రయాణికుల ముక్కు పిండి మరీ వసూలు చేస్తోంది. 'ఆర్టీసీ బస్సు - మీది - మాదీ - మనందరిదీ' అని ప్రవచించే ఆ సంస్థ ఛార్జీల విషయంలో మాత్రం 'ప్రైవేట్' సంస్థల్లాగా అవకాశవాదానికి పాల్పడుతోంది. ప్రస్తుతం దసరా పండగను పురస్కరించుకొని ఈనెల 18 నుంచి 28 వరకు 1,770 బస్సులను 50 శాతం అదనపు ఛార్జీలతో నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళిన బస్సులు తిరిగి వచ్చేటప్పుడు ఆక్యుపెన్సీ రేటు తక్కువగా ఉన్నకారణంగానే అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఆర్టీసీ చెబుతోంది.
పండగ వచ్చిందంటే - హైదరాబాద్ నుంచి తమ స్వస్థలాలకు వెళ్ళాలంటే ప్రజలు ఛార్జీల దెబ్బకు భయపడుతున్నారు. ప్రైవేట్ బస్ ఆపరేటర్లు పండగల అదను చూసి ఛార్జీలను 'డబుల్ ధమాకా' గా పెంచుతున్నారు. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి ఛార్జి 400 రూపాయలు ఉంటుంది. దసరా సందర్భంగా ఈనెల 26, 27 తేదీలలో వైజాగ్ వెళ్ళాలంటే మాత్రం 700 నుంచి 800 రూపాయలను ఛార్జీలు చెల్లించక తప్పదు. 'ప్రైవేట్' దోపిడీని తప్పించుకుందామని భావించే ప్రయాణికులు ఆర్టీసీ వైపు మొగ్గుచూపినా అక్కడ కూడా ఛార్జీల పేరిట 'దోపిడీ' చేయడం విచారం. పండగ సందర్భంగా అదనపు ఛార్జీలను వసూలు చేసే ఆర్టీసీ ...ఆ బస్సుల్లో ప్రయాణీకులు దూరాబారం ప్రయాణం చేయడానికి అనువా, కావా అన్నది మాత్రం చూడదు. సిటీబస్సుల్ని డిమాండ్ ను బట్టి అదనపు బస్సులుగా ఆర్టీసీ నడుపుతోంది. ఈ బస్సులో దూరప్రయాణం ఎంత 'హాయి'నిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు!
News Posted: 19 September, 2009
|