ఆ 'చాంబర్' అంటే దడ! హైదరాబాద్ : ముఖ్యమంత్రి పదవి అంటే సరే!... ప్రమాణం చేస్తాం కానీ... పూర్వపు ముఖ్యమంత్రి వాడిన ఛాంబర్ ను వినియోగించాలంటే మాత్రం... ఏ సీఎం అయినా సరే.. 'నో' అనే అంటున్నారు. ఇందులో సహేతుకత లేకపోయినప్పటికీ కోరి... కోరి చిక్కులు తెచ్చుకోవడం ఎందుకనే భావన - ఆయా సందర్భాల్లో సీఎంగా పనిచేసిన వారిలో నెలకొందని అర్థం చేసుకోవాలి.
వైఎస్ ఆకస్మిక మృతితో 'సీ'బ్లాక్ నుంచి విధుల నిర్వహణకు రోశయ్య సంకోచిస్తున్నారు. స్వయంప్రకాశకుడు అయిన ఎన్టీఆర్ 'జీ' బ్లాక్ నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ సమయంలో పరిపాలకునిగా పేరు తెచ్చుకునేందుకు రెవిన్యూ మంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రతివారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించేవారు. ముఖ్యమంత్రి పదవిని ఎన్టీఆర్ నుంచి చేజిక్కించుకున్నాక... చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని 'సీ' బ్లాక్ కు మార్చారు. సీ బ్లాక్ మూడవ అంతస్థులో నిర్మించిన ఆధునిక కార్యాలయంలో విధులు నిర్వహించిన చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి పదవికి నూతన జవసత్వాలు, ఒరవడిని సృష్టించారు. అంతర్జాతీయ స్థాయిలో సమర్ధ పరిపాలకునిగా గుర్తింపు పొందారు.
ఈ సమయంలో కరవు నెలకొన్న నేపథ్యంలో పాదయాత్రల ద్వారా ప్రజల ఆదరణతో నెగ్గిన వైఎస్ - చంద్రబాబునాయుడు వినియోగించిన కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి బాధ్యతల నిర్వహణకు విముఖత చూపారు. ముఖ్యమంత్రి హోదాకు 'ఛీఫ్ ఎగ్జిక్యూటివ్' ముద్ర వేయించుకోవడానికి ఇష్టపడని వైఎస్ తన 'రైతు పక్షపాతి' ఇమేజ్ ని కొనసాగించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆయన సీ బ్లాక్ లోని 4వ అంతస్థులో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం వైఎస్ విషాదాంతం నేపథ్యంలో రోశయ్య తను ఆర్థిక మంత్రిగా వాడిన 'జీ' బ్లాక్ నుంచే ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ అధిష్టానం ఆమోదంతో 'సీ' బ్లాక్ లోకి మారతారని భావిస్తున్న రోశయ్య... వైఎస్ వాడిన కార్యాలయంలోకి వెళ్తారా! లేక 'నూతన' నిర్ణయం తీసుకుంటారా అని రాజకీయ వర్గాలు ఎదురు చూస్తున్నాయి.
News Posted: 22 September, 2009
|