మౌనముద్రలో జగన్ శిబిరం హైదరాబాద్ : వైఎస్ స్థానంలో ఆయన కుమారుడు జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలంటున్న ఎంపీలు, ఎమ్మెల్మేలు, మంత్రులు వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు. వైఎస్ మృతి చెందిన తరువాత జగన్ ను సీఎం చేయాలని వారంతా కోరుతున్నా... అధిష్టానం 'అక్కడ సీఎం (రోశయ్య) ఉన్నారు' అంటూ కాలయాపన చేస్తోంది. తమకు ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లో ఎన్నికలపై దృష్టి కేంద్రీకరణ ఉన్నట్టు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. మరోవైపు కేవీపీ రామచంద్రరావు కూడా ఢిల్లీలో లాబీయింగ్ కు స్వస్తి చెప్పారు. ఈ నెల 25 తరువాత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, ప్రధాని మన్మోహన్ లతో జగన్ సమావేశం కానున్నారు. వైఎస్ మృతి అనంతరం సోనియా, మన్మోహన్ లు రాష్ట్రానికి వచ్చి తమను పరామర్శించినందుకు ఈ సందర్భంగా జగన్ కృతజ్ఞతలు చెబుతారు. అదేవిధంగా రాష్ట్రంలో పరిస్థితిని వివరిస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో పదేపదే 'జగన్నినాదం' ద్వారా అధిష్టానం ఆగ్రహానికి ఎందుకు గురి కావాలన్న 'సమయస్పూర్తి'ని ఆయన వర్గం ప్రదర్శిస్తోంది.
అదే సమయంలో ఇక్కడ ఎంపీలతో, ఎమ్మెల్యేలతో మంతనాలు మానలేదు. జగన్ బృందం భవిష్యత్ కార్యాచరణకు ఏం చేయాలన్నదానిపై అనేకమంది మంత్రులు, శాసనసభ్యులు, ఎంపీలతో వైఎస్ మిత్రుడు కేవీపీ రామచంద్రరావు చర్చలు జరిపారు. ఢిల్లీలో అధిష్టానం 'నాడి' ఎలా ఉందన్నది తెలుసుకునేందుకు రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుతో మంత్రులు బొత్స సత్యనారాయణ, వట్టి వసంతకుమార్, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి తదితరులు సమావేశమయ్యారు. ప్రస్తుతానికి మహారాష్ట్ర ఎన్నికల అనంతరం అధిష్టానం తగిన నిర్ణయం తీసుకుంటుందని జగన్ అభిమానులను ఆ వర్గానికి చెందిన పెద్దలు శాంతపరుస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల క్రతువు ముగిసిన అనంతరం అధిష్టానం తన 'తుది సందేశం' తెలిపాకనే జగన్ బృందం కార్యాచరణ ఏమిటనేది తేలుతుంది.
News Posted: 22 September, 2009
|