'షాక్ డెత్'లపై లెక్కలు హైదరాబాద్ : ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మికంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన అనంతరం రాష్ట్రంలో దిగ్భ్రాంతికి గురైన కాంగ్రెస్ వైఎస్ అభిమానుల మృతి, ఆత్మహత్యలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్టు తెలుస్తోంది. వైఎస్ మరణాంతరం 400 మంది వరకు చనిపోవడం లేదా ఆత్మహత్యలు చేసుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. వీటిలో నిజానిజాలు, ఈ సంఘటనలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారా అన్న అంశాలపై నిఘా అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. సాధారణంగా ఎవరైనా ప్రమాదంలో చనిపోయినప్పుడు, హత్యకు గురైనప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు ఉంటుంది. కానీ... ఇలా 'షాక్' డెత్ లకు ఎఫ్ఐఆర్ నమోదు ఉండదని ఒక సీనియర్ పోలీసు అధికారి పేర్కొన్నారు. ఇటీవల రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పిన తరువాతనే రైతుల ఆత్మహత్యలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో వైఎస్ ఆకస్మిక మృతి అనంతరం సంభవించిన సహజ మరణాలు, ఆత్మహత్యలపై ఎఫ్ఐఆర్ ఎలా ఉంటుందన్నది ప్రశ్నగా మారింది.
News Posted: 22 September, 2009
|