మిర్చి గ్రెనేడ్?! గౌహతి : మిర్చి గ్రెనేడ్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? కచ్చితంగా విని ఉండరు. కాని మన దేశ రక్షణ విభాగం శాస్త్రవేత్తలు అటువంటి ఒక గ్రెనేడ్ ను రూపొందించబోతున్నారు. ప్రపంచంలోనే అత్యధిక కారంతో కూడిన 'భూత్ జోలాకియా' మిర్చిని ప్రాణాంతకం కాని గ్రెనేడ్ గా రూపుదిద్దవచ్చునని అసోం తేజ్ పూర్ లోని డిఫెన్స్ రీసర్చ్ లేబొరేటరీ (డిఆర్ఎల్) విస్తృత పరిశోధనల అనంతరం నిర్థారణకు వచ్చింది. ఈ మిర్చిని 'నాగా చిల్లీ'గా కూడా పేర్కొంటుంటారు.
అంతేకాదు ఈ మిర్చిని పొడి చేసి జంతువులను తరమడానికి కూడా ఉపయోగించవచ్చునని డిఆర్ఎల్ సైంటిస్టులు సూచిస్తున్నారు. ఈ మిర్చి భాగాలను అమెరికాకు ఎగుమతి చేస్తున్నారు. ఆ దేశంలో దీనిని ఆహార పదార్థాలలో ఉపయోగిస్తున్నారు.
భూత్ జోలాకియాకు కారం లక్షణాలను ఉపయోగించి గ్రెనేడ్ ను తయారు చేయడానికి డిఆర్ఎల్ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. అల్లరి మూకలను చెల్లాచెదరు చేయడానికి లేదా ఇతర అవసరాలకు పోలీసులు, సైనికులు దీనిని ఉపయోగించవచ్చునని వారు సూచిస్తున్నారు. ఈ చిల్లీ గ్రెనేడ్ వల్ల పెద్ద సౌకర్యమేమంటే ఇది ప్రాణాంతకం కాకపోవడం అని డిఆర్ఎల్ సైంటిస్ట్ ఆర్.పి. శ్రీవాత్సవ పేర్కొన్నారు.
News Posted: 23 September, 2009
|