అడకత్తెరలో మంత్రులు! హైదరాబాద్ : కాంగ్రెస్ అధిష్టానం వైఖరి మారకపోవడంతో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మద్దతుదారులకు రోశయ్య కేబినెట్ లో పని చేయడం కత్తి మీద సాములాగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఉన్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జయంతీనటరాజన్ గురువారం కూడా మరోసారి స్పష్టం చేశారు. అవసరమైనపుడు సీఎల్ పీ జరుగుతుందన్నారు. మీడియా అడిగిన ప్రశ్నలకు 'చెప్పవలసిందంతా చెప్పాను' అని ఆమె స్పష్టం చేశారు. శుక్రవారం కర్నూలు జిల్లా నల్లకాల్వలో వైఎస్ మద్దతుదారుల బహిరంగ సభ నేపథ్యంలో జయంతీనటరాజన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఉంది. తాము ఇంకా బరిలోనుంచి పక్కకు తప్పుకోలేదన్న సంకేతంతో బహిరంగ సభను జగన్ కు మద్దతుగా వైఎస్ అభిమానవర్గం నిర్వహిస్తోంది.
అధిష్టానం చేసిన ప్రకటనతో కొంతమంది మంత్రులు గురువారం నాటి కేబినెట్ మీటింగ్ లో తాము సహకరిస్తామని ముఖ్యమంత్రి రోశయ్యకు హామీఇచ్చారు. జగన్ కు గట్టి మద్దతుదారులైన మంత్రులు రఘువీరారెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి కూడా 'మీ నాయకత్వంలో సంతోషంగా ఉన్నాం... మీ ఆదేశాలు పాటిస్తాం' అని ముఖ్యమంత్రి రోశయ్యకు తెలిపినట్లు సమాచారం. ఈ సమావేశానికి ఒక్క శిల్పామోహన్ రెడ్డి మినహా అంతా హాజరయ్యారు. ఈ సమావేశానికి రాలేనని ముందుగానే రోశయ్య అనుమతిని శిల్పా తీసుకున్నారు. అధిష్టానం ఆదేశం మేరకే తాను సీఎం పదవిని స్వీకరించానని కేబినెట్ లో మరోసారి రోశయ్య తెలిపారు. తనకు సహాయ నిరాకరణ చేస్తే, పార్టీ ఆగ్రహానికి గురి కావలసి వస్తుందని పరోక్షంగా హెచ్చరించారు... ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని డిమాండ్ చేసే మంత్రులకు ఏం చేయాలో పాలుపోని స్థితిని అధిష్టానం కల్పించింది. జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనే వారికల్లా 'ఇప్పటికే సీఎం ఉన్నారు' అని అధిష్టానం చెప్పడం పరోక్షంగా వారి డిమాండ్ ను తోసిపుచ్చడంగానే పరిశీలకులు భావిస్తున్నారు.
ఇటు వైపు రోశయ్యకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించడానికి వీలులేకపోతోంది. తాను వైఎస్ స్థానాన్ని భర్తీ చేయడం లేదు అంటూనే, అధిష్టానం చెప్పిన కారణంగానే సీఎం బాధ్యతలు చూస్తున్నాను అని స్పష్టం చేస్తున్నారు. పెద్దరికంగా మాట్లాడుతున్న రోశయ్యతో తలపడితే రాగల పరిణామాలను ఊహించి మంత్రులు మౌనంగా ఉండాల్సి వస్తోంది. ఈ క్రమంలో వైఎస్ జగన్ మద్దతుదారులుగా కొందరు మంత్రులకు కేబినెట్ లో కొనసాగడం 'ఇబ్బంది'గానే ఉంది. జగన్ ముఖ్యమంత్రి కానిపక్షంలో వైఎస్ మద్దతుదారులు కేబినెట్ లో కొనసాగడంలో అర్థం లేదని ఐటీ శాఖ మంత్రి వెంకటరెడ్డి, శాసనసభ్యుడు ఆనం వివేకానందరెడ్డి అభిప్రాయపడుతున్నారు.
News Posted: 25 September, 2009
|