బాబు మదిలో మధ్యంతరం! హైదరాబాద్ : రాష్ట్రంలో సంభవిస్తున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మధ్యంతర ఎన్నికలు జరగగలవన్న అంచనాతో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పార్టీని సర్వసన్నద్ధం చేస్తున్నారు. తాజాగా ప్రకటించిన తెలుగుదేశం రాష్ట్ర కమిటీ, పొలిట్ బ్యూరో నియామకాల్లో ఈ ప్రయత్నం కనిపిస్తోంది. పార్టీ శ్రేణులతో సమన్వయాన్ని పెంచుకునేందుకు ప్రతి రోజూ 'కార్యకర్తలతో దర్బార్'ను చంద్రబాబు ప్రారంభించారు. మంగళవారం కోస్తాలో ఆరు జిల్లాలకు చెందిన కార్యకర్తలతో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలు, పార్టీలో ఇబ్బందులను, తీసుకోవలసిన చర్యలను కార్యర్తలు పార్టీ అధ్యక్షుని దృష్టికి తెచ్చారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థికి అధిక ఓట్లు పోలైన మండలాలను కరవు ప్రాంతాలుగా గుర్తించని విషయాన్ని కూడా పార్టీ అధినేతకు తెలియజేశారు.
నూతనంగా నియమించిన రాష్ట్ర కమిటీ (286 మంది సభ్యులు)లో సీనియర్లతో పాటు వెనుకబడిన తరగతుల వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రజారాజ్యంలో చేరి తిరిగి తెలుగుదేశం గూటికి చేరిన దేవేందర్ గౌడ్, సీతారాములను దూరంగా పెట్టడం ద్వారా పార్టీ పట్ల అంకిత భావం ఉన్నవారికే పెద్దపీట ఉంటుందన్న విషయాన్ని తెలుగుదేశం నాయకత్వం చాటింది. రాష్ట్రంలో తప్పని సరై మధ్యంతర ఎన్నికలు సంభవిస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీనియర్ నాయకులకు చంద్రబాబునాయుడు సూచించారని తెలుస్తోంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రోశయ్యను మార్చకూడదని ఢిల్లీ అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ లో చీలికకు దారీ తీయవచ్చని తెలుగుదేశం వర్గాలు అంచనా వేస్తున్నాయి.
జగన్ సీఎం చేయకపోతే తమ పదవులకు రాజీనామా చేస్తామని కొంతమంది మంత్రులతో సహా 10 మంది శాసన సభ్యులు హెచ్చరిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆ వర్గాలు ఉదహరిస్తున్నాయి. సభలో రోశయ్య బలం నిరూపించుకోవలసిన పరిస్థితులు ఎదురైతే శాసన సభకు మధ్యంతర ఎన్నికలు అనివార్యం కావచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. సామాజిక వర్గం పరంగా కూడా పార్టీ పదవుల నియామకాల్లో సమతౌల్యం పాటించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. తాను సినిమాలతో బిజీగా ఉన్నట్లు నందమూరి బాలకృష్ణ చెప్పడంతో హరికృష్ణను పొలిట్ బ్యూరోలో కొనసాగించారు. మరోవైపు సినిమావాళ్ళు తెలుగు మహిళ పదవికి అచ్చిరావడం లేదన్న సెంటిమెంట్ తో సీతాదయాకర్ రెడ్డికి ఆ పదవిని కట్టబెట్టినా... ఆమె అంతగా ఉత్సాహం చూపలేదు. మారుతున్న పరిస్థితుల్లో తాను నియోజకవర్గాలపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. ఈ ఒక్క అంశం మినహా స్థూలంగా చూసినప్పుడు ముందు చూపుతో పార్టీని చంద్రబాబు సన్నద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
News Posted: 30 September, 2009
|