నీడలేని నీలేకని! న్యూఢిల్లీ : దేశంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యూనిక్ ఐడింటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ప్రాజెక్ట్ చైర్మన్ పదవిని నందన్ నీలేకని చేపట్టి రెండు నెలలైనా ఆయనకు ఇంకా వసతి దొరకలేదు. ప్రాజెక్టు కార్యాలయానికి, ఆయన నివాసానికి అనువైన చోటు ఇంకా లభించనందున ప్రాజెక్టు అమలు జాప్యం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన 'యోజన భవన్' లోని 124వ నంబర్ రూమ్ లో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ప్రాజెక్టుకు అనుసంధానమైన జార్ఖండ్ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి రామ్ సేవక్ వర్మ కు ఇక్కడ మరో రూమ్ ను కేటాయించారు. మిగిలిన సిబ్బంధి అంతా నీలేకని గది బయటే పచార్లు చేయాల్సి వస్తోంది. ప్రాజెక్టు కార్యాలయానికి అవసరమైన స్థలం అన్వేషణలో జాప్యం జరుగుతున్నప్పటికీ, వారంలో మూడు రోజులు బెంగళూరులో గడపడమే నీలేకనికి కొంత ఊరటగా ఉంది.
'యూఐడీ' కార్యాలయం కోసం కన్నాట్ ప్లేస్ లోని ఎల్ ఐసీ భవనాన్ని పరిశీలిస్తున్నట్లు వచ్చిన వార్తలను ప్రస్తావించగా తాము పరిశీలిస్తున్న అవకాశాల్లో ఇది కూడా ఒకటని నీలేకని చెప్పారు. ప్రస్తుతం వివిధ జూడీషియల్ కమిషన్లు కొనసాగుతున్న విజ్ఞాన భవన్ లో ప్రాజెక్ట్ కార్యాలయం ఏర్పాటును నీలేకని తిరస్కరించారు. మొత్తం మీద ప్రాజెక్టు కార్యాలయానికి వసతి ఏర్పాటులో ఆలస్యానికి - ఈ ప్రాజెక్టుకు హోం శాఖ, ప్లానింగ్ కమిషన్... రెండు విభాగాలతో సంబంధం ఉండడమేనని ప్రధాని కార్యలయం వర్గాలు తెలిపాయి.
News Posted: 30 September, 2009
|