హూడా ప్రచార సరళే వేరు చండీగఢ్ : ఎన్నికల ర్యాలీలలో ఉపన్యాసాలు చేయడం రాజకీయ నాయకుల వంతు కాగా కూర్చుని, కొండొకచే నిలబడే వినడం జనం వంతు. కాని హర్యానా ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హూడా ఆ పద్ధతిని మార్చివేశారు. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల సందర్భంగా ర్యాలీలలో తానే పూర్తిగా ప్రసంగించకుండా జనమే మాట్లాడేట్లు ఆయన చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరు గురించి, రాష్ట్రంలో తన హయాంలోను, ఇతర పార్టీల హయాంలలోను చేపట్టిన అభివృద్ధి పనుల గురించి హూడా పెద్దగా మాట్లాడడం లేదు. ర్యాలీలలో సమీకృతమైన ప్రజలకు ఆయన ఈ విషయమై కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టుతున్నారు. తాను కోరుకుంటున్నదేదో ప్రజలతోనే ఆయన ఈవిధంగా చెప్పిస్తున్నారు. ఆతరువాత ఆయన సంబంధింత అంశంపై మరి నాలుగు ముక్కలు మాట్లాడుతున్నారు.
మారిన హూడా ప్రచార సరళి శనివారం ఇస్రానా, సమల్ ఖాన్, గన్నౌర్, రాయి, కహర్ ఖోడా, బహదూర్ గఢ్ నియోజకవర్గాలలో పలు ఎన్నికల ర్యాలీలలో ద్యోతకమైంది. ఉదాహరణకు ఇస్రానాలో హూడా ఐఎన్ఎల్ డి - బిజెపి కూటమి ప్రభుత్వం ప్రజలకు ముఖ్యంగా రైతులకు అనుకూలంగా తీసుకున్న ఒక్క నిర్ణయం గురించి అయినా చెప్పవలసిందని ప్రజలను కోరారు. ఆయన అంతకుముందు ఆ కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసి, అమలు జరపలేకపోయిన కార్యక్రమాల గురించి వారికి వివరించారు. ఆయన ప్రశ్నకు జనం నుంచి 'ఒక్కటీ లేదు' అనే సమాధానం వచ్చింది. 1987లో ఐఎన్ఎల్ డి రైతుల రుణాలన్నిటినీ మాఫీ చేస్తామనే వాగ్దానంతో అధికారంలోకి వచ్చిందని, కాని అప్పటి ముఖ్యమంత్రి దేవీలాల్ రూ. 28 కోట్ల మేరకు మాత్రమే రుణాలను మాఫీ చేశారని హూడా ఈ సందర్భంలో జనానికి గుర్తు చేశారు. అయితే, 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చరిత్ర సృష్టించిందని, పార్టీ ఎన్నికల ప్రణాళికలో ప్రస్తావించకపోయినప్పటికీ రూ. 1600 కోట్ల మేరకు రైతుల విద్యుత్ బిల్లు బకాయిలను ప్రభుత్వం మాఫీ చేసిందని హూడా తెలియజేశారు.
వడ్డీ, పెనాల్టీతో సహా రూ. 830 కోట్ల మేరకు రైతుల సహకార రుణాలను మాఫీ చేసిందెవరని హూడా సమల్ ఖాన్ లో జనాన్ని అడిగారు. 'హూడా ప్రభుత్వం' అని వెంటనే జనం నుంచి సమాధానం వచ్చింది. ఐఎన్ఎల్ డి - బిజెపి ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేయడానికి బదులు బకాయిలు ఉన్న రైతులను జైళ్ళలో పెట్టి, అవమానించిందని, వారి భూములను వేలం వేసిందని ఆయన సభికులకు గుర్తు చేశారు. రైతుల భూముల వేలానికి ప్రాతిపదిక చేసుకున్న చట్టాన్నిరద్దు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన చెప్పారు.
యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధి మార్గదర్శకత్వంలో, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సమర్థమైన నేతృత్వంలో యుపిఎ ప్రభుత్వం ఏవిధంగా రూ. 72 వేల కోట్ల మేరకు రైతుల రుణాలను మాఫీ చేసిందీ హూడా ప్రజలకు గుర్తు చేశారు. హర్యానాలో రైతులు రూ. 2136 కోట్ల మేరకు ప్రయోజనం పొందారని ఆయన తెలిపారు. గతంలో అటువంటి నిర్ణయాన్ని తీసుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందా అని ఆయన జనాన్ని అడిగారు. ఆయన ఆశించినట్లుగానే అటువంటి ప్రభుత్వమేదీ లేదని జనం సమాధానం ఇచ్చారు.
News Posted: 5 October, 2009
|