బరిలో ములాయం కోడలు ఫిరోజాబాద్ (ఉత్తర ప్రదేశ్) : సమాజ్ వాది పార్టీ (ఎస్ పి) అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కుటుంబం నుంచి మరొకరు రాజకీయ అరంగేట్రం చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో త్వరలో నిర్వహించనున్న ఉప ఎన్నికలలో తన అభ్యర్థిగా ములాయం యాదవ్ కోడలు డింపుల్ యాదవ్ ను పార్టీ ఎంపిక చేసింది. ఎస్ పి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ ఆదివారం ఫిరోజాబాద్ లో బ్రహ్మాండమైన ర్యాలీలో ప్రసంగిస్తూ, తాను రాజకీయ కుటుంబ సభ్యురాలైనప్పటికీ రాజకీయ రంగంలో ప్రవేశించడం ఒక విధంగా తనకు వణుకు పుట్టిస్తున్నదని అంగీకరించారు.
ఆకుపచ్చ రంగు చీర ధరించిన డింపుల్ మందస్మిత వదనంతో బహిరంగ సభలో కెమెరా మన్ లకు ధన్యవాదాలు తెలియజేశారు. తన మావగారు, భర్త, ఇతర బంధువుల సమక్షంలో సభలో డింపుల్ ప్రసంగిస్తూ, 'నియోజకవర్గానికి, ప్రజలకు సేవ చేయడమే నా ప్రధాన ధ్యేయం' అని చెప్పారు. ఒక పూజారిలా నియోజకవర్గానికి సేవలు అందిస్తానని ఆమె చెప్పారు. 'మై యహాఁ కీ బేటీ, బహు, భాభీ హూఁ ఔర్ మైఁ హర్ తరహ్ సే ఇస్ క్షేత్ర కీ తరక్కీ కే లియే కామ్ కరోంగి' (నేను ఈ ఊరికి కుమార్తెను, కోడలిని, వదినను కూడా. ఈ ఊరి బాగు కోసం నన్ను నేను అంకితం చేసుకుంటాను' అని డింపుల్ చెప్పారు.
మహిళలు, యువజనులు, రైతులకు తన అజెండాలో సమాన స్థాయి కల్పించగలనని ఆమె ప్రకటించారు. 'మహిళలు, యువజనులు, వ్యవసాయదారుల సంక్షేమం కోసం పాటుపడాలని ఆకాంక్షిస్తున్నాను' అని డింపుల్ చెప్పారు. తన విజయానికి ప్రతి ఒక్కరి ఆశీస్సులు, మద్దతు కావాలని ఆమె కోరారు. తనను తమ అభ్యర్థిగానే పరిగణించాలని కూడా ప్రజలను డింపుల్ కోరారు.
News Posted: 5 October, 2009
|