రాజోళి చేనేత ఛిద్రం రాజోళి : కర్నూలు జిల్లాను అతలాకుతలం చేసిన వరద ధాటికి రాజోళిలోని చేనేత కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలాయి. దాదాపు 16 వేల మంది జనాభా ఉన్న రాజోళిలో 250 చేనేత కుటుంబాలున్నాయి. తరువాత గణనీయసంఖ్యలో మత్స్యకారులున్నారు. చేనేత పనివారల ఇళ్ళల్లోని నూలు, డైలు, దారాలు అన్నీ కూడా వరదపాలయ్యాయి. మహబూబ్ నగర్, కర్నూలు జిల్లా సరిహద్దుల్లోని ఈ పట్టణంలో ప్రాణాలతో మిగిలిన చేనేత కుటుంబాలు రేపటి గురించి బెంగటిల్లుతున్నారు. ఇక్కడకు 40 కిలోమీటర్లు దూరంలోని గద్వాల పట్టణంలోని వ్యాపారులు వీరి చేత పట్టు చీరలు నేయించేవారు. కానీ, మగ్గాలు, ఇతర సామాగ్రి అంతా గంగపాలు కావడంతో కార్మికులు దిక్కుతోచని స్ధితిలో ఉన్నారు. మగ్గాల్లోకి నీరు చేరడంతోపాటు, ఇళ్ళు కూడా నీళ్ళలో నానడంతో కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. దీంతో వారికి నివాసంకూడా సమస్యగా మారింది. దీంతో కొంత మంది 'మేం చనిపోతేనే బాగుండేదని' వరద వైరాగ్యం చూపుతున్నారు. 20 ఏళ్ళ కిందట ఇటువంటి అనుభవం చవిచూశామని అంటూ, ఇంతలా ఒక్కసారిగా అన్నీ కోల్పోయిన పరిస్థితి లేదని చేనేత కార్మిక సంఘం నాయకుడు వడ్డి హనుమంతు పేర్కొన్నారు. నిన్నటిదాకా మగ్గాలసందడి, వస్త్రాల సోయగాలతో కళకళలాడిన రాజోళి నేడు చివికిన వస్త్రంలా మారింది!
News Posted: 6 October, 2009
|