రోశయ్యకు రూట్ క్లియర్! హైదరాబాద్ : ముఖ్యమంత్రిగా రోశయ్య స్థానాన్ని మరింతగా పదిలం చేసేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాందీ సమ్మతించినట్లు తెలియవస్తోంది. సోమవారం కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లా వరద బాధిత ప్రాంతాలలో ఆమె ఏరియల్ పర్యటన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని సుస్థిరం చేయడంతోపాటు సమర్ధంగా పాలనా యంత్రాంగాన్ని నడిపించాలని సోనియా అభిప్రాయపడ్డారని సమాచారం. మంత్రి వర్గానికి నూతన రూపం ఇచ్చేందుకు సోనియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. 'కొన్ని తలలు మారొచ్చు. కొందరు సీనియర్లతో పాటు నూతన శాసన సభ్యులు కేబినెట్ లో అవకాశం కలుగుతుంది' అని పార్టీ వర్గాలు పెర్కొన్నాయి. ఏరియల్ సర్వేలో ఆమెతో పాటు రోశయ్య, కేంద్ర హోంమంత్రి చిదంబరం, పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ ఉన్నారు. ఈ సమయంలో వీరితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి వీరప్ప మొయిలీ లేకపోవడం గమనార్హం.
రాష్ట్రంలో వరద పరిస్థితులతో పాటు రాజకీయ పరిణామాల పట్ల కూడా సోనియా ఆందోళన చెందారని విశ్వసనీయ వర్గాల భోగట్టా. ఈ క్రమంలో 2014 ఎన్నికల్లో తిరిగి విజయ సాధన దిశగా పనిచేయాలని ఇందుకు సమర్థమైన ప్రభుత్వం అవసరమని ఆమె భావిస్తున్నారు. రోశయ్య నాయకత్వం పట్ల ఆమె విశ్వాసాన్ని వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వరదల సమయంలో ముఖ్యమంత్రిగా రోశయ్య - పరిపాలనా యంత్రాంగాన్ని నడిపిన తీరును ఆమె ప్రశంసించారు. 'కిపిటప్' అంటూ అభినందించడం ముఖ్యమంత్రిగా ఇప్పుడే కుదురుకుంటున్న రోశయ్యకు వెయ్యి ఏనుగల బలం వచ్చినట్టైంది.
News Posted: 6 October, 2009
|