మంత్రుల వరద 'విహారం' హైదరాబాద్ : వరద బాధిత ప్రాంతాల్లో ప్రజలను పరామర్శించడానికి కూడా మంత్రులు అట్టహాసంగా 'సందర్శన యాత్ర' తలపెడుతున్నారు. మంత్రి అంటే... మాటలు కాదు కదా! మందీ మార్బలం ఉంటేనే... మంత్రి! అందుకనే వరద పోటెత్తిన ప్రాంతాల్లో కూడా 'రాజు వెడలె రవి తేజములలరగ' అన్నట్లుగా కొందరు 'పరామర్శ' యాత్రలు చేస్తున్నారు. బాధితుల కష్టసుఖాల మాటెలా ఉన్నా వీరికి మాత్రం 'విహారయాత్ర' లాగే ఉన్నట్లు కనిపిస్తోంది. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి ఎం ముఖేష్, ఐటి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ జిల్లాలో వర్షం బాధిత ప్రాంతాలను పర్యటించేందుకు... 25 వాహనాల కాన్వాయ్ తో బయలు దేరారు! ఇందుకోసం మల్లెపల్లి సమీపంలోని గువ్వలగుట్టను ఎంచుకున్నారు.
అయితే వారంతా నేరుగా సందర్శించాల్సిన ప్రాంతానికి వెళ్ళలేదు. మంగళవారం 12.30 గంటల ప్ర్రాంతంలో మల్లేపల్లి వద్ద ఒక డెయిరీ వద్ద తేనీరు సేవించి రిలాక్స్ అయ్యారు. తరువాత మజిలీ... చిన మంజల్ గ్రామం. అక్కడ స్థానిక జడ్పీటీసీ సభ్యుని ఇంటి దగ్గర చికెన్, మటన్, చేపల కూరలతో విందారగించారు. తరువాత 'లక్ష్యం' వైపు మంత్రుల బృందం దృష్టి సారించింది. అక్కడి నుంచి వైజాగ్ కాలనీకి వెళ్ళారు. వైజాగ్ ప్రాంతం నుంచి వచ్చిన జాలర్లు ఈ కాలనీలో ఉంటున్నారు. అనంతరం గువ్వల గుట్టకు మంత్రులు, వారి అనుచరగణం కదిలింది. ఈ సమయంలో 'గుట్ట' వెళ్ళలేరని చెప్పడంతో మంత్రులు తమ సందర్శనను 'బోటు షికారు'తో ముగించారు. వీరి వెనుక విలేఖరులు, అధికారుల బృందం ఉన్న పడవ వరదలో చిక్కుకుపోయింది. అయినా ముందు చూపులో ఉన్న మంత్రుల బృందం హైదరాబాద్ బాట పట్టింది! తరువాత అధికారులకు సమాచారం చేరవేయడం ద్వారా అధికారులు, విలేఖరులు బయట పడ్డారన్నది వేరే సంగతి!
News Posted: 7 October, 2009
|