నదుల 'కలయిక'తో ముప్పు న్యూఢిల్లీ : నదుల అనుసంధానం తేనెటీగల తుట్టెను కదిలించడంగా మారుతుందా! 'అనుసంధానం' అన్న భావన - వినాశనానికి దారి తీస్తుందని కేంద్ర పర్యావరణ అటవీశాఖ మంత్రి జైరామ్ రమేష్ అభిప్రాయపడుతున్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 'నదుల అనుసంధానం మానవాళికి పర్యావరణ - ఆర్థిక విపత్తుగా మారుతుంది. అనుసంధానం చేసే నదులకు పరిమిత పరీవాహక ప్రాంతం ఉంటుంది. పెద్ద ఎత్తున అనుసంధానం చేయడం పెను విపత్తు కాగలదు' అని పేర్కొన్నారు. రమేష్ వ్యాఖ్యలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నదుల అనుసంధానం ప్రాజెక్టుపై నీలినీడలు అలుముకున్నాయి.
నెలక్రితం రాహుల్ గాంధీ చెన్నైలో మాట్లాడుతూ అనుసంధానం వల్ల తలెత్తే పర్యావరణ సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతితో ఆటలొద్దని హెచ్చరించారు. అయితే రాహుల్ వ్యాఖల్ని యూపీఏ మిత్రపక్షం డీఎంకే ఆక్షేపించింది. అధికంగా నీరు ప్రవహించే నదుల నుంచి నీరు తక్కువగా ప్రవహిస్తున్న నదుల్లోకి నీటిని తరలించే అంశాన్ని అధ్యయనం చేయడానికి ఇందిరాగాంధీ 1982లో జాతీయ జలాల అభివృద్ధి సంస్థను నెలకొల్పిన విషయాన్ని డీఎంకే ప్రస్తావించింది. 2004లో యూపీఏ తన కనీస ఉమ్మడి అజెండాలో నదుల అనుసంధానాన్ని ప్రస్తావించిన విషయాన్ని డీఎంకే గుర్తు చేసింది. దీనిపై కాంగ్రెస్ స్పందించలేదు.
ఇదే విషయమై కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ, 'అనుసంధానం పెద్ద సమస్య. అదేమీ మంత్రదండం కాదు. అనుసంధాన ప్రక్రియపై ఆందోళన ఉన్నప్పటికీ... అది దీర్ఘకాలిక పరిష్కారమే' అని చెప్పారు. 'దీన్ని ఎవరు తిరస్కరిస్తారు, ఎవరు ఆమోదిస్తారన్నది నాకు తెలియదని, గణనీయంగా నిధులు వ్యయం చేసిన 25 ఏళ్ళ తరువాత కూడా ఇవే ప్రశ్నలు కొనసాగవచ్చు. పరిజ్ఞానం లేకుండా విమర్శలు చేయలేం. అనుసంధానం బహుళార్ధక ప్రాజెక్టు అన్నది సందేహం లేదు. మంచి చెడులను పెద్దలు నిర్ణయిస్తారు' అని వివరించారు.
కేంద్రం జల సంఘం ఛైర్మన్ నాయకత్వంలోని కమిటీ గత ఐదేళ్ళలో ఏడు సార్లు సమావేశమైంది. ఐదుచోట్ల అనుసంధానం చేయాలని గుర్తించారు. వాటిలో ఒకటి గోదావరి - కృష్ణా నదుల సంధానం. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కృష్ణమ్మ పరవళ్ళు తొక్కిన నేపథ్యంలో అనుసంధాన ప్రక్రియపైన కూడా విమర్శలు చెలరేగే అవకాశం ఉంది.
News Posted: 7 October, 2009
|