చేతల్లో చూపిస్తా: కొత్త డిజిపి హైదరాబాద్ : తనపై నమ్మకం ఉంచి ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను సమక్రమంగా నెరవేరుస్తానని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డిజిపి) ఆర్ఆర్ గిరీష్ కుమార్ చెప్పారు. పోలీస్ శాఖలో జవాబుదారీతనం పెంచడంతో పాటు డిజిపి బాధ్యతలను సవాల్ గా తీసుకుని శాఖ పని తీరును తీర్చిదిద్దుతానని, పారదర్శకంగా వ్యవహరిస్తామని చెప్పారు. అవినీతి నిరోధక శాఖ డిజిపిగా ఉన్న ఆయనను రాష్ట్రానికి కొత్త డిజిపిగా బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా డిజిపి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా గిరీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ సంఘ విద్రోహులను కఠినంగా అణచివేస్తామని అన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదని, దీని ప్రతిష్ఠ, గౌరవాన్ని మరింత పెంచడంలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని గిరీష్ కుమార్ అన్నారు. నేరాల నియంత్రణ, మైనార్టీలు, మహిళలపై దాడులు అరికట్టడంతో పాటు ఉగ్రవాదం, ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారిస్తామని చెప్పారు. ఎసిబిలో పని చేస్తున్నప్పుడు మీడియా ఎంతో సహకరించిందని, దాని వల్లే సమర్ధవంతంగా నిర్వహించగలిగానని అన్నారు. డిజిపి హోదాలోనూ మీడియాతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తానని అన్నారు.
మావోయిస్టులు, ఉగ్రవాదుల కోసం ప్రస్తుతం పని చేస్తున్న ఏజెన్సీలు వాటి పని అవి చేస్తుంటాయని, వాటిని ఇంకా బలోపేతం చేస్తామని చెప్పారు. రాష్ట్ర క్యాడర్ కి చెందిన ఆర్ ఆర్ గిరీష్ కుమార్ 1976 బ్యాచ్ ఐపిఎస్ అధికారి. గుంటూరు, నెల్లూరు, విజయవాడ ఎస్ పి గా పని చేశారు. అనంతరం పదోన్నతిపై ఇంటిలిజెన్స్ డిఐజిగా, ఆ తర్వాత మండలం డిసిపిగా పని చేశారు. అనంతరం పదోన్నతిపై ఇంజిలిజెన్స్ డిజిఐగా, ఆ తర్వాత 1988-89 లో ఐజిగా పదోన్నతి పొందారు. సిఐడిలో ఆర్ధిక నేరాల నియంత్రణ విభాగంలో ఐజిగానూ, అదే సిఐడి విభాగానికి అదనపు డిజిపిగా పని చేశారు. ఆ తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్సు మెంట్ డైరెక్టర్ జనరల్ గా పని చేశారు. 2007లో ఎసిబి విభాగానికి డిజిఐగా నియమితులయ్యారు. ఎసిబి నుంచి డిజిపిగా ఇప్పుడు బదిలీ అయ్యారు. 1971-72 లో ఐఐటిలో కెమిస్ట్రీ విభాగంలో పిజి చేశారు. ఐపిఎస్ లో చేరిన తర్వాత 1999-2001 మధ్య శెలవు పెట్టి అమెరికాలో ఎంబిఏ చేశారు.
News Posted: 8 October, 2009
|