గ్యాస్ తో జెన్ సెట్లు చెన్నై : ఈ శీతాకాలంలో మీ విద్యుత్ బిల్లులను తగ్గించుకోండి. మీ వంట గదికి సహజ వాయువు పైప్ లైన్ (పిఎన్ జి) ఉన్నట్లయితే, దానిని గ్యాస్ ఆధారిత గీజర్ కు కూడా కనెక్ట్ చేయించుకోవచ్చు. ఈ రకం గీజర్ చౌక కూడా. దేశమంతటా ఎనిమిది లక్షల గృహాలలో గ్యాస్ సిలిండర్ల వాడకాన్ని తప్పించిన పిఎన్ జి త్వరలోనే ఎయిర్ కండిషననర్లు, జనరేటర్ సెట్లకు కూడా అందుబాటులోకి రావచ్చు.
'ఢిల్లీ, ఎన్ సిఆర్ లలో వంటకు సంబంధించని ఇతర అవసరాలకు గ్యాస్ ఆధారిత సాధనాల వాడకాన్ని ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (ఐజిఎల్) ప్రోత్సహించసాగింది' అని ఐజిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ వేదవ్యాస్ తెలియజేశారు. 'మేము వాటర్ గీజర్లతో ప్రారంభించి, తరువాత ఎసిలకు, జెన్ సెట్లకు విస్తరిస్తాం' అని ఆయన తెలిపారు.
గ్యాస్ లభ్యత పెరుగుతుండడంతో ముంబై, లక్నో, పుణె, అహ్మదాబాద్ తో సహా 20 నగరాలలో ఎక్కువ ఖరీదు చేయని గ్యాస్ ఆధారిత ఉపకరణాలకు దీని వినియోగాన్ని విస్తరించనున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్), అదానీ గ్రూప్ వంటి భారీ ప్రైవేట్ సంస్థలు ఈ వ్యాపార రంగంలోకి ప్రవేశిస్తుండడంతో ఈ సంఖ్య రెండేళ్ళలో రెట్టింపు కావచ్చు.
'వంటేతర అవసరాలకు గ్యాస్ వినియోగాన్ని మేము పెంచుతున్నాం' అని ముంబైకి చెందిన గ్యాస్ పంపిణీ సంస్థ మహానగర్ గ్యాస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పి.కె. గుప్తా వెల్లడించారు. 'గ్యాస్ తో పని చేసే ఎసిలు మార్కెట్ లోకి రావడానికి కొంత వ్యవధి పట్టగలదు. కాని గుజరాత్ లో కస్టమర్లు ఈ మార్పునకు అప్పుడే సిద్ధంగా ఉన్నారు' అని గుజరాత్ గ్యాస్ లిమిటెడ్ అధికారి ఒకరు పేరు వెల్లడి చేయకూడదనే షరతుపై చెప్పారు.
ఉత్పత్తిదారులు కూడా సమాయత్తం అవుతున్నారు. 'మేము సిద్ధంగా ఉన్నాం' అని పుణె ప్రధాన కేంద్రంగా గల రాకోల్డ్ సంస్థ అధికారి ఒకరు తెలియజేశారు. ఆయన కూడా తన పేరు వెల్లడికి ఇష్టపడలేదు.
News Posted: 9 October, 2009
|