ముస్లింలు 157 కోట్లు వాషింగ్టన్ : ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న జనాభాలో ముస్లింల సంఖ్య 157 కోట్లకు పైగా చేరింది. మొత్తం ప్రపంచ జనాభా 680 కోట్లలో వారి వాటా 23 శాతం. 20 కోట్లతో ఇండోనేషియా మొదటి స్థానంలో ఉండగా, 17.4 కోట్లతో పాకిస్తాన్, 16.1 కోట్ల మందితో భారత్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ మేరకు వాషింగ్టన్ లోని అధ్యయన సంస్థ ' పీ ఫోరమ్ ఆన్ రిలీజెన్ అండ్ పబ్లిక్ లైఫ్' స్పష్టం చేసింది. భారత్, పాక్ లతో పాటు బంగ్లాదేశ్ లోని ముస్లింలు కూడా కలిస్తే వీరి సంఖ్య 48 కోట్లకు చేరుతుంది. ఇది ప్రపంచ ముస్లిం జనాభాలో 31 శాతం! అంటే మూడో వంతు అన్నమాట! 'మ్యాపింగ్ గ్లోబల్ ముస్లిం పాపులేషన్' పేరిట జరిగిన ఈ అధ్యయనంలో ప్రపంచంలో ఏయే దేశాల్లో ముస్లింలు విస్తరించిందీ... వారి పరిణామం, తెగలు తదితర అంశాలతో నివేదిక రూపొందిస్తారు. ఈ నివేదిక ఆధారంగా ముస్లింల పెరుగుదల రేటుతో రూపొందించే సమాచారాన్ని వచ్చే ఏడాది విడుదల చేస్తారు.
ఇస్లాం ప్రధాన మతం కానిదేశాల్లో ప్రపంచంలోని ఐదోవంతు మంది ముస్లింలు (30కోట్లు) నివసిస్తున్నారు. ఉదాహరణకు భారత్ లో అధిక సంఖ్యలో ముస్లింలు నివసిస్తున్నారు. జోర్డాన్, లిబియాల్లో కన్నా రష్యాలో; సిరియాలో కన్నా చైనాలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. రష్యాలో 1.6 కోట్లమంది, చైనాలో 2.2 కోట్ల మంది ముస్లింలు నివసిస్తున్నారు. ప్రపంచంలో 232 దేశాల్లో సేకరించిన సమాచారం ఆధారంగా రూపొందించిన కమిటీ నివేదిక ఇది. దీని ప్రకారం ప్రపంచంలోని ముస్లింల్లో సున్నీ తెగవారు 87 నుంచి 90 శాతం వరకు ఉన్నారు. అదే విధంగా 10 నుంచి 13 శాతం వరకు షియాలు ఉన్నారు. షియాల్లో 68 నుంచి 70 శాతం వరకు నాలుగు దేశాలు - ఇరాన్, పాకిస్థాన్, ఇండియా, ఇరాక్ లో జీవిస్తున్నారు.
News Posted: 9 October, 2009
|