పత్తా లేని వరద కమిటీ! న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, కర్నాటకలో వరదల వల్ల సంభవించిన వ్యయాన్ని అంచనా వేసేందుకు త్వరలో అధికారిక కమిటీ సమావేశం కానుంది. వరద బాధిత రాష్ట్రాల్లో వరదల నియంత్రణ, నదిగట్ల పటిష్టత పనుల నిర్వహణకు 2007లో ఈ కమిటీని కేంద్ర జలవనరుల శాఖ నెలకొల్పింది. ఇప్పటివరకు నాలుగుసార్లు సమావేశమైన ఈ కమిటీ చివరిసారిగా గత జూలై 10న సమావేశమైంది! 2007లో 11వ పంచవర్షప్రణాళిక (2007-2012) కింద 8 వేల కోట్ల రూపాయలతో వరద నిర్వహణ పథకం (ఎఫ్ఎంపీ)ను రాష్ట్రాల నిర్వహణ కింద కేంద్రం ప్రారంభించింది.
ఈ పధకం కింద ఇప్పటివరకు 16 రాష్ట్రాలకు 2,425 కోట్ల విలువైన 281 వరద నియంత్రణ, నదీ నిర్వహణ పథకాలకు కేంద్రం సాయం చేసింది. అయితే, ఈ పథకాలు నత్తనడక నడుస్తున్నాయని కేంద్రం ఆక్షేపిస్తోంది. ఈ పథకాల్లో రాష్ట్రాలు చొరవ చూపడం లేదని పేరు వెల్లడికి ఇష్టపడని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. దేశంలో 1953 నుంచి 2004 వరకు వచ్చిన వరదల గణాంకాలను కేంద్ర జల సంఘం సంకలనం చేసింది. ఆయా వరదల్లో సగటున ప్రాణనష్టం 1590, ప్రజా ఆస్తులకు 806.78 కోట్లు నష్టం సంభవించిందని స్పష్టం చేసింది. పదో పంచవర్ష ప్రణాళిక (2002-2007) కు వరద నియంత్రణ పథకంపై ఒక అధ్యయన బృందాన్ని కేంద్రం నియమించింది. దేశంలో వరద ముంపునకు గురయ్యే ప్రాంతం మొత్తం 45.64 మిలియన్ల హెక్టార్లుగా అంచనా వేసింది. ఇందులో 18.22 మిలియన్ల హెక్టార్ల ప్రాంతానికి రక్షణ ఏర్పాట్లను ప్రణాళికాంతానికి చేయ వచ్చునని ఈ బృందం పేర్కొంది.
వరద నియంత్రణ చర్యల్లో భాగంగా... నిర్మాణ, నిర్మాణేతర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. రిజర్వాయర్ల నిర్మాణం, గరిష్టంగా కరకట్టల ఏర్పాటు, కాలువలను మెరుగుపరచడం, గ్రామాలలో తగిన చర్యలు చేపట్టడం వంటివి నిర్మాణ చర్యలు. వరద ప్రాంతాలను గుర్తించడం, వరదల్ని పసిగట్టి ప్రజలను హెచ్చరించడం రెండో కోవలోకి వస్తాయి.
News Posted: 9 October, 2009
|