నిండా మునిగిన టూరిజం! హైదరాబాద్ : గత వారం సంభవించిన వరదల ప్రభావానికి రాష్ట్రంలో పర్యాటకరంగం కుదేలైంది. ప్రధాన పర్యాటక కేంద్రాలైన విజయవాడ, శ్రీశైలం, నాగార్జున సాగర్ ల సందర్శనకు పర్యాటకులు రాని కారణంగా ఇప్పటి వరకు 35 లక్షల మేరకు ఆదాయాన్ని పర్యాటక శాఖ నష్టపోయింది. ఆయా జిల్లాల్లో పరిస్థితులు కుదుట పడుతున్నా పర్యాటకులు మరో 10 రోజులపాటు పెరిగే అవకాశం కనిపించడం లేదు. శ్రీశైలంలో ఈనెల 2 నుంచి హోటళ్ళలో బుకింగ్స్ రద్దయ్యాయి. భ్రమరాంబ ఆలయం నుంచి పాతాళ గంగవరకు 'రోప్ వే'ను, 'బోటు షికారు'ను రద్దు చేశారు. 'బోటు షికారు, రోప్ వే'ల వల్ల 70 నుంచి 75 వేలవరకు, హోటళ్ల వల్ల 30 నుంచి 35 వేల రూపాయల వరకు రోజుకు ఆదాయం లభించేంది. ప్రస్తుతం ఈ మొత్తం పర్యాటక శాఖ నష్టంగా మారిందని పర్యాటక శాఖ అధికారి చెప్పారు. విజయవాడలోని భవానీ ద్వీపానికి వరద దెబ్బ ఎక్కువగానే తగిలింది. ఇక్కడ రోజుకి లక్షన్నర రూపాయల వరకు ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది. విజయవాడ నుంచి వచ్చే పర్యాటక శాఖ - ఆదాయంలో 50 శాతం భవానీ ద్వీపానిదే!
అదే విధంగా హైదరాబాద్ నుంచి రోజుకు 1200 మంది వరకు సాగర్ వచ్చే పర్యాటకులు కూడా ఇప్పుడు రావడం లేదు. వారం పది రోజుల్లో పరిస్థితి కుదుట పడుతుందని అధికారులు ఆశిస్తున్నారు. అయితే మిగిలిన పర్యాటక కేంద్రాలతో పోలిస్తే సాగర్ కు పర్యాటకులు నామమాత్రంగా వస్తున్నారు. సాగర్ వద్ద రహదారులన్నీ దెబ్బతిన్నాయి. పర్యాటకుల సంఖ్య తగ్గడానికి ఇది కూడా ఒక కారణం. ఆదాయం దాదాపు మూడో వంతు తగ్గింది. బోటు షికారుల ఆదాయం పూర్తిగా పడిపోయింది. హోటళ్ళ ద్వారా రోజుకి 25 లక్షల నుంచి లక్ష రూపాయల వరకు లభించే ఆదాయం రెండింట మూడొంతులకు తగ్గింది. తిరిగి పర్యాటక కేంద్రాల్లో పర్యాటకుల సంఖ్య పెరిగీ... ఆదాయ మార్గం పుంజుకోవడానికి కనీసం పదిరోజులకుపైగా పడుతుందని పర్యాటక శాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు.
News Posted: 10 October, 2009
|