'అనుసంధానం అసాధ్యం' హైదరాబాద్ : దేశంలో నదుల అనుసంధానం అంత తేలికైన పని కాదని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. అనుసంధానం వల్ల రాగల పరిణామాలను ముందుగా అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. ఇటీవల నదుల అనుసంధానం ప్రమాదకరమని కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి రాహుల్ గాంధీ, పర్యాటక శాఖ మంత్రి జైరామ్ రమేష్ అభిప్రాయపడిన నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. శుక్రవారం హైదరాబాద్ లో మీడియా సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ, అనుసంధానాన్ని పరిశీలించేటప్పుడు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. 'నదుల అనుసంధానం దీర్ఘకాలికంగా ఉన్న ప్రతిపాదనేనని... అదేమీ తేలికైన కార్యంకాదు. ఇది పర్యావరణ సమస్యలను సృష్టించవచ్చు. అన్ని కోణాలను పరిగణనలోకి తీసుకొని అధ్యయనం చేయాల్సి ఉంది' అని పేర్కొన్నారు.
నదుల అనుసంధానాన్ని కేంద్రమంత్రి జైరామ్ రమేష్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ వ్యతిరేకించిన విషయాన్ని ప్రస్తావించగా, ప్రధాని పై విధంగా స్పందించారు. నదుల అనుసంధానం చేయాలన్న ప్రతిపాదన భాజపా నాయకత్వంలోని ఎన్డీఏ హయాంలో మొదలైంది. ఆంధ్రప్రదేశ్ లో వరదల వంటి విషాదాలపై అంత:శోధన అవసరమని వ్యాఖ్యానించారు. ఈ వరదలకు కారణాలను అధ్యయనం చేయాలని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్ డీ ఎం ఎ ) ను ఆదేశిస్తామన్నారు. కృష్ణానదికి వరదలు రావడానికి అధికారుల వైఫల్యమే కారణమన్న ప్రతిపక్షాల ఆరోపణ కూడా పరిశీలిస్తామన్నారు.
News Posted: 10 October, 2009
|