మంత్రాలయం నిధులు భద్రం మంత్రాలయం : ఇటీవలి వరదల్లో సంపూర్ణంగా జలమయమైన మంత్రాలయం మఠంలో విలువైన స్వామి వారి నగ, నట్రా భద్రంగా ఉన్నాయి. రాఘవేంద్ర స్వామి వారి రజిత రథం, స్వర్ణ రథం, హుండీలు కూడా కొట్టుకుపోకుండా నిలిచాయి. ఇందుకు వరద ప్రారంభమైన సమయంలో అక్కడి సిబ్బంధి తగిన జాగ్రత్తలు తీసకున్నారు. వరద మొదలు కాగానే రథాలను, వాటికి నిర్మించిన గదుల్లో నిలబెట్టి తాళం వేశారు. అలాగే నగలను, హుండీలను కూడా భద్రం చేశారు దీంతో ఎంతగా వరద వచ్చినా అది కొట్టుకుపోలేదు. హుండీలోని కరెన్సీ నోట్లు మాత్రం తడిచాయి.
వరద వల్ల ఆలయంలో పేరుకుపోయిన బురదను తొలగిస్తున్నారు. మఠంలో దాదాపు 6 వేల మందికి భోజనం పెడుతున్నారు. అక్కడ బాలాజీ ఆలయం వరదల తాకిడికి గురి కాలేదు. ఆ ఆలయంలోని వంటగదిని భోజనాల తయారీకి వాడుతున్నారు. 40 మందికి పైగా వంట సిబ్బందిని బెంగళూరు నుంచి రప్పించారు. మూడువేల ఎకరాల్లో విస్తరించిన మంత్రాలయం మఠంలో 400 గదులు, 40 కాటేజీలు, ఇతర భవనాలు ఉన్నాయి. వరదలకు ఇవన్నీ కూడా బురద మయం కావడంతో పాటు, కొంతమేర దెబ్బతిన్నాయి. దీంతో అక్కడ బురదను తొలగించి కొత్త రూపు ఇచ్చే కార్యక్రమాన్ని వెయ్యిమంది సిబ్బంది చేట్టారు. వారిలో ఏడు వందల మంది స్వచ్ఛంద కార్యకర్తలే.
మంత్రాలయం పునరుద్ధరణ పనులకు కనీసం 30 కోట్ల రూపాయలు వ్యయం కావచ్చునని స్వామీజీ సుయతీంద్ర స్వామి చెప్పారు. ఇప్పటికే కర్నాటక 10 కోట్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఆలయంలో మహా సంప్రోక్షణతో పాటు, నారాయణ అష్ఠాక్షరీ మంత్రాన్ని జపిస్తూ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్వామివారిని తరచూ సందర్శించే భక్తులు ఇచ్చే సహాయ, సహకారాలతో మఠం పునరుద్ధరణ పనులు ఇంకా వేగం అందుకుంటాయని భావిస్తున్నారు. స్వామివారిని సందర్శించే ప్రముఖుల్లో సినీ ప్రముఖులు రజనీకాంత్, చిరంజీవి, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి దంపతులు ఉన్నారు.
News Posted: 10 October, 2009
|