శిథిల క్షేత్రం అలంపూర్! హైదరాబాద్ : శతాబ్ధాల పాటు పవిత్ర పుణ్య క్షేత్రంగా విరాజిల్లిన చారిత్రక పట్టణం ఇక చరిత్ర పుటలకే పరిమితం కావచ్చు. 'దక్షిణ కైలాసం' గా భక్తుల నీరాజనాలు అందుకున్న అలంపూర్ శిథిలమై పోయింది. వరద పీడ వదలిపోయి మిగతా జిల్లాలన్నీ కుదుటపడుతుంటే అలంపూర్ మాత్రం ఇంకా నీటిలో మునిగే ఉంది. రెండడుగుల పైనే బరదతో కప్పబడి ఉంది. ఈ పట్టణంలో బతుకుతున్న ఇరవై వేల మంది బతుకులు చితికిపోయాయి. ఇళ్ళన్నీ నామరూపాలు లేకుండా పోయాయి. అసలు అలంపూర్ తుడిచిపెట్టుకుపోయింది. ఇక ఈ పట్టణంలో జీవించడం సాధ్యం కాదనీ, తమకు మరో చోటు చూపించాలని, ఇళ్ళు కట్టివ్వాలని అలంపూర్ ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్ర రాజధాని నగరానికి రెండు వందల కిలోమీటర్ల దూరంలో మహబూబ్ నగర్ జిల్లాలో అలంపూర్ ఉంది. తుంగభద్ర, కృష్ణా నదుల మధ్య వందల సంవత్సరాలుగా ఈ పట్టణం వైభవంగా వెలిగింది. బాదామీ చాళుక్యులు రెండువందల సంవత్సరాల క్రితం అలంపూర్ లో తొమ్మిది నవబ్రహ్మ ఆలయాలు నిర్మించారు. వాటిని శివునికి అంకితం చేశారు. అప్పటి నుంచీ దక్షిణ కైలాసంగా అలంపూర్ అపూర్వ వైభవాన్ని చవి చూసింది. ఆరు, ఏడు శతాబ్ధాల క్రితమే నిర్మించిన అనేక ఇతర ఆలయాలు కూడా అలంపూర్ లో ఉన్నాయి. అలంపూర్ నకు పడమరగా శ్రీశైలం పుణ్యక్షేత్రం ఉండటంతో దీనిని శ్రీశైలం పశ్చిమ ముఖద్వారం అని కూడా వ్యవహరిస్తారు.
ఎంత పుణ్యక్షేత్రమైనా గంగమ్మతల్లి ఆగ్రహం పుణ్యమాని అలంపూర్ శాపగ్రస్తగా మారిపోయింది. పట్టణం బురదలో మునిగిపోయింది. నరమానవుడు కాలుపెట్టడానికి వీలులేని ప్రదేశంగా దుర్గంధభూయిష్టంగా మిగిలిపోయింది. ఇక్కడి ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయమే. వరి, మిరప, పొద్దు తిరుగుడు పంటలను పండించేవారు. అనేక వందల కుటుంబాలు అలంపూర్ కు వచ్చే భక్తుల మీద ఆధారపడి చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. వరదలు పంటలను తుడిచిపెట్టేశాయి. ఒక్కటి కూడా మిగలకుండా మొత్తం ఇళ్లను నేలమట్టం చేశాయి. 'మేము జీవితం అంతా కష్టపడి ఐదు లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు పునాదులు కూడా కనిపించడం లేదు. దిక్కులేని వాళ్ళలా రోడ్ల మీద బతుకున్నామ'ని 65యేళ్ళ వృద్ధ మహిళ అవేదనతో చెప్పింది.ఈమె కుటుంబంలోని పదకొండు మంది సభ్యులు నిలువ నీడ లేకుండా పోయారు.
శిథిల పట్టణంలో తాము బతకలేమని తమకు మరో కొత్త ప్రదేశం చూపించాలన్న డిమాండ్ ను అలంపూర్ ప్రజలు ముగ్గురు మంత్రుల ముందు ఉంచారు. మూడు రోజుల క్రితం వచ్చిన ఈ మంత్రులను అలంపూర్ ప్రజల ఐక్యంగా నిలదీశారు. జిల్లాకు చెందిన మంత్రి డికె అరుణ కూడా ఈ బృందంలో ఉన్నారు. అష్టకష్టాలు పడుతున్న తమను ఆదుకోడానికి ఇంతవరకూ ప్రభుత్వం ముందుకు రాకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో ప్రదేశంలో తమకు ప్రభుత్వమే ఇళ్లు కట్టించి పునరావాసం కల్పించాలని అలంపూర్ ప్రజలందరూ డిమాండ్ చేశారు. ఈ బాధితులను జిల్లా కలెక్టర్ కె దమయంతి కూడా పరామర్శించినప్పుడూ ప్రజలు ఇదే డిమాండ్ ను ఆమె ముందుంచారు. కొత్త పట్టణాన్ని నిర్మించడం అనే నిర్ణయాన్ని ప్రభుత్వమే తీసుకోవాలని, అయితే అది అసాధ్యమైనదేమీ కాదని దమయంతి చెప్పారు. కాగా అలంపూర్ పరిస్థితిని ముఖ్యమంత్రి రోశయ్యకు వివరించారని తెలిసింది. ఇప్పటికీ అలంపూర్ ప్రజలు రోడ్ల పక్కనో, లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లోనో కాలం గడుపుతున్నారు.
News Posted: 11 October, 2009
|