పవర్ హౌస్ పడకేసినట్లే? హైదరాబాద్ : వరద కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ ఇక్కట్లు ఇప్పట్లో తప్పే అవకాశం కనిపించడం లేదు. ఈనెల మొదటి వారంలో వరదలతో శ్రీశైలంలోని విద్యుత్ కేంద్రాలు పని చేయకపోవడంతో దాదాపు 1670 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కుంటుపడింది. ఎడమ గట్టువైపున ఉన్న విద్యుత్ కేంద్రం వారంలోగా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించవచ్చని ప్రభుత్వం, ట్రాన్స్ కో, జెన్ కోలు అభిప్రాయపడ్డాయి. అదే సమయంలో నీట మునిగిన కుడి గట్టు విద్యుత్ కేంద్రం పూర్తిగా నీటమునగడంతో పునరుద్ధరణకు మూడునెలల పైగా సమయం పడుతోందని భావించారు. ఈలోగా వారం పదిరోజుల్లో ఎడమవైపు విద్యుత్ కేంద్రం పనిచేస్తే విద్యుత్ కష్టాలు తీరతాయని ప్రభుత్వ అధికారులు భావించారు.
కానీ... పరిస్థితి ఊహించని దానికన్నా తీవ్రంగానే ఉంది. ఎడమ వైపు విద్యుత్ కేంద్రంలో కూడా మూడు యూనిట్ల గేట్లు ధ్వంసమయ్యాయి. పవర్ హౌస్ లో పెద్ద ఎత్తున వరద నీరుంది. పునరుద్ధరణ పనులకు అంచనా వేసినదానికన్నా ఎక్కువ సమయం పడుతుందని ఏపీ జెన్ కో డైరెక్టర్ ఆదిశేషు చెప్పారు. కుడివైపు విద్యుత్ కేంద్రంలో నీటిని తోడే పనిలో భెల్, నైవేలి లిగ్నేట్, జెన్ కోలకు చెందిన నిపుణులు నిమగ్నమయ్యారు. మరోవైపు విద్యుత్ ఉత్పత్తిలో సంకట పరిస్థితిని అధిగమించేందుకు రాష్ట్రానికి 700 మెగావాట్ల విద్యుత్ ను కేటాయించాలని ముఖ్యమంత్రి రోశయ్య కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం విద్యుత్ కేంద్రాల పునరుద్ధరణ ఆలస్యం అవుతోందన్న సమాచారంతో ఈ మొత్తాన్ని 1000 మెగావాట్లకు పెంచారు.
News Posted: 12 October, 2009
|