భళారే! వి'చిత్రం'! హైదరాబాద్ : వెయ్యి పదాల్లో చెప్పే వార్తను అరటిపండు ఒలిచి పెట్టినట్లుగా చెప్పడానికి ఒక్క వార్తా చిత్రం చాలు! పాఠకుడిని ఆకట్టుకుంటుంది. ఫలానా వ్యక్తి మా నాయకుడు అని చాటడానికి ఏం చేయాలి! పచ్చబొట్టు పొడిపించుకోనక్కరలేదు! దాసరి నామాలూ పెట్టుకోనక్కరలేదు! తాము కొలువు చేసే చోట సదరువ్యక్తి 'ఫోటో'ను గోడ'కుర్చీ' వేయిస్తే చాలు! కాగలకార్యం ఫోటో నెరవేరుస్తుంది. ఈ సత్యాన్ని గ్రహించిన రాష్ట్రమంత్రుల్లో కొందరు ముఖ్యమంత్రి రోశయ్య చిత్రపటాన్ని తమ కార్యాలయాల్లోని గోడలకు అలంకరించారు! తద్వారా ఇతరుల కన్నా ముందుగా రోశయ్య దగ్గర మంచి మార్కులు కొట్టేయాలన్నదే ఇందులోని తంత్రం! ఇందులో కూడా వైఎస్ 'మద్దతు వ్రతం' చెడకుండా చూసుకోవడం రాజకీయ లౌక్యం! ఇంతకు ముందు సీఎంగా రోశయ్య చేసిన సమీక్షలకు హాజరుకాని వారు కూడా రోశయ్య చిత్రపటాలను తమ ఇళ్ళల్లోనూ, కార్యాలయాల్లోనూ 'కనిపించేలా' వేలాడదీయడమే తక్షణ రాజకీయ 'అవసరాన్ని' సూచిస్తుంది.
ఇటీవల సమాచార, పౌరసంబంధాల శాఖ సరఫరా చేసిన ముఖ్యమంత్రి చిత్రాలను వారి 'ఇచ్ఛా'నుసారం మంత్రులు నెలకొల్పారు. కొంతమంది మంత్రులు దివంగత వైఎస్ ఫోటోతో పాటు రోశయ్యది కూడా ఏర్పాటు చేశారు. 'ముఖ్యమంత్రి కనుక రోశయ్య చిత్రాన్ని, మాకు దార్శనికుడు గనుక వైఎస్ ఫోటోను పెట్టుకున్నాం' అని ఒక మంత్రి ఫోటోల ఏర్పాటులో మర్మాన్ని తెలిపారు. పర్యాటక శాఖ మంత్రి గీతారెడ్డి కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ముఖ్యమంత్రి రోశయ్య, దివంగత సీఎం వైఎస్ ఫోటోలు ఉన్నాయి. మరో మంత్రి దానం నాగేందర్ తో సహా అనేకమంది మంత్రుల 'చిత్ర త్రయం' ఫార్ములాను పాటిస్తున్నారు. ఇంకొంత మంది మంత్రులు ముగ్గురి ఫోటోలను వరుసగా తాము కూర్చునే చోట గోడ పై భాగంలో అమర్చారు. వీరిలో కొంతమంది రోశయ్య ఫోటో పై భాగంలో ఉండేలా జాగ్రత్త వహిస్తున్నారు.
'అధికారం' చిహ్నంగా మంత్రులంతా సీఎం ఫోటోలు అలంకరించుకుంటుంటే రోశయ్య మాత్రం తన కార్యాలయంలో పాతపద్ధతిలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని పెట్టుకున్నారు. అలాగే రాష్ట్రపతి ప్రతిభాపాటిల్, సోనియాగాంధీ చిత్రాలు ఉన్నాయి. పాపం! రోశయ్య తన అధికార 'దర్పాన్ని' ప్రదర్శించక పోయినా మంత్రులు మాత్రం ఆయన 'అధికారాన్ని' గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు! కొంతమంది 'గుర్తిస్తున్నట్లు'గా కనిపిస్తున్నారు.
News Posted: 12 October, 2009
|