బాబు స్పీడుతో బేజారు హైదరాబాద్ : రాష్ట్రంలో వరదలు ముంచ్చెత్తినప్పుడు, అనంతర పరిస్థితులలోనూ ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు చూపిన వేగానికి అధికార పార్టీ నాయకులు బేజారెత్తారు. నిర్వహణా పద్ధతులు, రాజకీయ ఎత్తుగడలు వేయడంలో సిద్ధహస్తుడైన చంద్రాబు నాయుడు మరో సారి తన ఎత్తుగడను ప్రదర్శించారు. వరదల సమయంలో అప్పటికప్పుడు ఆయా జిల్లాల్లోని తెలుగుదేశం నాయకులకు బాధితుల్ని తరలించేందుకు, సహాయ శిబిరాలు ఏర్పాటు చేసేందుకు టెలీకాన్ఫరెన్స్ ల ద్వారా తగిన సూచనలు ఇచ్చారు. అనంతరం ఏరియల్ సర్వే చేయడమే కాకుండా ప్రధాని, కేంద్ర వ్యవసాయ మంత్రులతో ఫోన్ లో మాట్లాడి రాష్ట్రంలో వరద తీవ్రత వల్ల కలిగిన కష్టనష్టాలను వివరించారు.
ముంపు జిల్లాల్లో బాధితులను పరామర్శించడంలో, సహాయం అందించడంలో చంద్రబాబు ముందంజలో ఉన్నారు. ఆయా ప్రాంతాలకు ఆయన ముందుగా వెళ్లి బాధితుల్ని పరామర్శించడం అధికారపక్షానికి ఇరకాటాన్ని కల్పిస్తోంది. వరద బాధిత జిల్లాల్లో ముఖ్యమంత్రి కన్నా ముందుగా చంద్రబాబు పర్యటిస్తున్నారు. కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల్లో బాధితులకు తమ పార్టీ ద్వారా కొంత మేరకు సహాయాన్ని అందిస్తున్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ నుంచి ప్రతిరోజూ పది లారీల్లో బాధితులకు అవసరమైన వస్తు సామాగ్రిని తరలిస్తున్నారు. ఆదివారం ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున 5 లారీలను ఆయా జిల్లాలకు పంపారు. మాజీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మహమ్మద్ సలీం ఇచ్చిన వస్తుసామాగ్రిని ఐదు లారీల్లో పంపించారు. అంతేగాకుండా బాధితులకు అందుతున్న సహాయ సహకారాలను సక్రమంగా పర్యవేక్షించేందుకు 42 మంది సీనియర్ తెలుగుదేశం నాయకులతో ఒక కమిటీని కూడా చంద్రబాబు నియమించారు.
'నా పర్యటనలో ఎటువంటి ఉద్దేశ్యం లేదు. నేను పర్యటించడం వల్ల ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వస్తుంది. తద్వారా బాధితులకు మేలు కలుగుతుంది' అని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. కానీ వరద పరిస్థితుల నుంచి రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. 'చంద్రబాబు నాయుడు తనకేదో ఎక్కువగా బాధ్యత ఉన్నట్టుగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ కూడా ఆయన లక్ష్యం ఏమిటో తెలుసు' అని కాంగ్రెస్ నాయకులు అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
News Posted: 12 October, 2009
|