'పీవీ కాదు వైఎస్ పేరు' హైదరాబాద్ : శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ నగరంలోకి త్వరగా చేరుకునేందుకు నిర్మించిన పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ హైవే పనులు పూర్తి చేసుకొని, ప్రారంభానికి సిద్ధమైంది. అయితే ఈ ఎక్స్ ప్రెస్ మార్గానికి మాజీ ప్రధాని పీవీ పేరు పెట్టడాన్ని మజ్లిస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. మెహదీపట్నం లోని సరోజనీదేవి ఆస్పత్రి నుంచి ఆరాంఘర్ వరకు నిర్మించిన ఎక్స్ ప్రెస్ హైవే మార్గం వల్ల శంషాబాద్ విమానాశ్రయం నుంచి 40 నిమిషాల్లో నగరంలోకి చేరుకోవచ్చు. 2006 సెప్టెంబర్ లో ప్రారంభమైన ఈ రహదారి నిర్మాణానికి 600 కోట్ల రూపాయలు వ్యయమైంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఆదేశించిన మేరకు అక్టోబర్ 2వ తేదీ నాటికి ఎక్స్ ప్రెస్ హైవే వినియోగానికి అధికారులు రంగం సిద్ధం చేశారు.
అయితే పీవీ పేరును మజ్లిస్ వ్యతిరేకించిన కారణంగా ప్రారంభోత్సవం వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఎక్స్ ప్రెస్ మార్గంలో రంగులు వేయడం, సామర్థ్య పరీక్షను నిర్వహించడం వంటివి పూర్తి చేయాల్సిన కారణంగా అక్టోబర్ 2న పీవీ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించలేకపోయినట్లు మునిసిపల్ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. అయితే నిర్మాణ సంస్థ హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలెప్ మెంట్ అథారిటీ (హెచ్ ఎండీఎ) చీఫ్ ఇంజనీర్ మాత్రం పనులు పూర్తయినట్టు చెబుతున్నారు. ఎక్స్ ప్రెస్ హైవేను ప్రారంభానికి సిద్ధంగా చేశామన్నారు. ఈ నేపథ్యంలో ఎక్స్ ప్రెస్ హైవే పదిరోజులు క్రితమే సిద్ధమైనా ప్రారంభించకపోవడానికి పీవీ పేరుపై మజ్లిస్ అభ్యంతరమే కారణమనని తెలుస్తోంది.
'పీవీ పేరు పట్ల అభ్యంతరాన్ని తెలిపాం. ఆయన హయాంలోనే బాబ్రి కట్టడం కూలింది. పీవీ పేరు మార్చాలని నిరసన తెలుపుతున్నాం. పీవీ బదులు వైఎస్ పేరు పెట్టాలని సూచిస్తున్నాం' అని మజ్లిస్ నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసి పేర్కొన్నారు. నిజానికి 2006లో నిర్మాణం ప్రారంభమైన ఈ ఎక్స్ ప్రెస్ హైవేకు పీవీ పేరును దివంగత ముఖ్యమంత్రి వైస్సే ప్రతిపాదించారు. అప్పట్లో ఎవరూ ఈ నామకరణాన్ని వ్యతిరేకించలేదు. వైఎస్ మరణించాక ఆయన చేసిన నామకరణన ప్రతిపాదనను వ్యతిరేకించడం ఏ మేరకు సబబని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలియరాలేదు.
News Posted: 13 October, 2009
|