చిరు ఇమేజ్ తగ్గిందా? హైదరాబాద్ : వరద బాధిత ప్రాంతాల్లో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పర్యటనకు బాధితుల నుంచి అంతంతమాత్రంగానే స్పందన లభిచడం పట్ల పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వరద బాధితులను పరామర్శించేందుకు ఆయన గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పర్యటించగా తమ సమస్యలు వివరించేందుకు బాధితులు పెద్దగా ఆసక్తి చూపలేదు. చిరు టూర్ కు స్పందన కొరవడటానికి తగిన ప్రచారం లేకపోవడంతో పాటు, ప్రణాళికా లోపమే కారణమని తెలుస్తోంది. పర్యటన ఏర్పాట్లలలో స్థానిక పార్టీ నాయకులు పెద్దగా ఆసక్తి చూపలేదని పార్టీ అధిష్టానానికి నివేదిక అందుతుంది. 'బాధితుల్లో అనేకమంది తమ బంధువుల ఇళ్ళకు వెళ్ళారు. చిరు పర్యటనలో తక్కువ స్పందన రావడానికి ఇదే కారణం. దీనికి తోడు తాము కష్టాల్లో ఉన్నప్పుడు చిరు పర్యటనకు హాజరు కావాలని అభిమానులు, బాధితులు కోరుకోరు కదా' అని ఒక సీనియర్ ప్రజారాజ్యం నాయకుడు వివరించారు.
కానీ విశ్వసనీయ వర్గాల ప్రకారం సాధారణ ఎన్నికల అనంతరం చిరంజీవి జిల్లా పర్యటనలు చేయకపోవడానికి కారణం స్థానిక నేతల్లో ఆసక్తి లేకపోవడమేనని తెలుస్తోంది. వరద ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితే తలెత్తింది. అసలే వరదలతో ఈరోజు గడిచేది ఎలా అని ఎదురుచూస్తున్న స్థితిలో పర్యటనలు ఏర్పాటు చేయటం స్థానిక ప్రజారాజ్యం నాయకులకు శక్తికి మించిన పనిగా మారిందని పరిశీలక వర్గాలు భావిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజాకర్షణ గల నాయకుల్లో చిరంజీవే ముందు ఉంటారని ఒక నాయకుడు అభిప్రాయపడ్డారు. 'రాష్ట్రంలో వైఎస్ మరణం నేపథ్యంలో ప్రజలను పెద్ద ఎత్తున ఆకర్షించగలిగిన నాయకుడు ఎవరూ లేరు. ప్రస్తుత నాయకుల్లో ఒక్క చిరంజీవికే ఆకర్షణ శక్తి ఉంది. ముందస్తు ప్రణాళికతో పర్యటనలు చేస్తే వచ్చే ఏడాది జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజారాజ్యం తన సత్తా చూపుతుందని' మరో విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు.
News Posted: 13 October, 2009
|