అరుణాచల్‌పై చైనా లొల్లి న్యూఢిల్లీ : చైనా సరిహద్దులు మీరుతోంది. భారత్ లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ లో ప్రధాని మన్మోహన్ సింగ్ పర్యటించడాన్ని చైనా విదేశాంగ శాఖ తప్పుపట్టింది. ఇరు దేశాల నడుమ సుహృద్భావ వాతావరణం నెలకొంటున్న ప్రస్తుత తరుణంలో భారత ప్రధాని అరుణాచల్ ప్రదేశ్ పర్యటన తమను తీవ్రమైన అంసంతృప్తికి గురిచేసిందని ఆదేశ విదేశాంగ శాఖ అధికారిక వెబ్ సైట్లో ప్రకటనను ఉంచింది. దీనిపై భారత విదేశాంగ మంత్రి ఎస్ ఎం కృష్ణ కూడా తీవ్రంగానే స్పందించారు. చైనా ప్రకటనను ఖండించారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమేనని మరోసారి స్పష్టంగా ప్రకటించారు. ‘అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగం. దానిని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాం. మరొకరు ఏం చేప్తున్నారనే దానితో సంబంధంలేదు. ఇదే భారత ప్రభుత్వ అంతరంగం’ అని విదేశాంగ మంత్రి ఎస్.ఎం. కృష్ణ పేర్కొన్నారు.
‘చైనా తీవ్రంగా పరిగణిస్తున్న వివాదాస్పద ప్రాంతంలో గందరగోళానికి అవకాశమివ్వకూడదని భారత్‌ను డిమాండ్ చేస్తున్నాం. అప్పుడే చైనా-భారత్‌ల ఆరోగ్యకరమైన అభివృద్ధికి దోహదపడుతుంది’ అని చైనా విదేశాంగశాఖ అధికారప్రతినిధి మా జాక్సు అన్నారు. అంతే కాకుండా భారత్, చైనాలు ఎప్పుడూ అధికారికంగా సరిహ ద్దును పరిష్కరించుకోలేదని వ్యాఖ్యానించారు. తూర్పు భాగంలోని సరిహద్దు విషయమై తాము చాలా స్పష్టంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. చైనా ప్రకటన వెలువడిన కొద్ది సేపట్లోనే భారత్‌లోని బీజింగ్ రాయబారి జాంగ్ యాన్ హుటాహుటిన విదేశాంగశాఖ కార్యాలయానికి వెళ్లారు. చైనా జాయింట్ సెక్రెటరీ ఇంచార్జ్ విజయ్ గోఖలేతో భేటీ అయ్యారు.
అరుణాచల్‌లో అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకుగాను భారత్ ఇటీవల ఆసియా అభివృద్ధి బ్యాంకును ఆశ్రయించడం చైనా తాజా ప్రకటనకు కూడా ఒక కారణమైంది. టిబెటన్ల బౌద్ధమత గురువు దలైలామ గత నెలలో రాష్ట్రాన్ని సందర్శించడమూ ఆ దేశానికి ఆగ్రహాన్ని తెప్పించింది. గత ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో మన్మోహన్ అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించినప్పుడు కూడా చైనా అభ్యంతరం తెలిపింది. అక్కడ ఒక బహిరంగసభలో ప్రధాని మాట్లాడుతూ తమది ‘సూర్యోడు ఉదయించే భూమి’ అని వ్యాఖ్యానించగా, అప్పుడు కూడా చైనా తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. దీనికి అప్పటి విదేశాంగ శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర స్వరాన్నే వినిపించారు. ‘భారత్‌లో అరుణాచల్ ప్రదేశ్ అంతర్భాంగం. అంతర్భాగంగా ఉన్న ప్రదేశాల్లోకి ప్రధాని తరచుగా వెళ్లి వస్తుంటారు. చైనా అభ్యంతరాలతో భారత్ కు సంబంధం లేదు' అని ప్రకిటించారు.
News Posted: 13 October, 2009
|