ముంబయి : మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా జ్యోతిష్యవేత్తలు - హేతువాదుల మధ్య మరోసారి పోరాటం జరుగుతోంది. మంగళవారం జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈనెల 22న వెల్లడి కానున్నాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మంత్రుల్లో నిక్షిప్తమైన ఓట్లు సరళి జ్యోతిష్యవేత్తలు - హేతువాదుల్లో ఎవరు విజేతలన్నది కూడా నిర్ణయిస్తుంది. జ్యోతిష్యాన్ని మోసంగా విమర్శించే మహారాష్ట్ర అంధ విశ్వాస నిర్మూలన సమితి (ముఢనమ్మకాల నిర్మూలన కమిటి)... జ్యోతిష్యాన్ని శాస్త్రంగా నిరూపించినవారికి 21 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. అందుకు ఎన్నికల ఫలితాలను 'వేదిక'గా చేసుకుంది. ఏ జ్యోతిష్యవేత్త అయినా సరే... తనకు ఇష్టం వచ్చిన 10 మంది అభ్యర్థుల జాతకాలను తీసుకొని... వారిలో ఎవరు గెలుస్తారన్నది తెలపాలని ఈ సమితి సవాల్ చేస్తోంది. తమ జోస్యం ఎలా నిజమైంది... వారు వివరించాలని కూడా సమితి కోరింది. వారు చెప్పిన జ్యోతిష్యంలో 80 శాతం నిజమైనా... వారు విజేతలుగా నిలిచినట్టేనని ప్రకటించింది. ఈ సవాలును స్వీకరించిన జ్యోతిష్యవేత్తలు ఇప్పటికే 40మంది తమ ఎంట్రీలను దాఖలు చేశారు. తొలుత ఈనెల 12వ తేదీ వరకు ఎంట్రీలు చేరడానికి తుది గడువుగా సమితి ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఈ గడువును 21వ తేదీ వరకు పొడిగించింది. తాము బహుమతిగా ఇస్తామన్న 21 లక్షల రూపాయలను బ్యాంకు ఖాతాలో సిద్ధంగా ఉంచామని జ్యోతిష్యవేత్తలను ఊరిస్తోంది. మరి ఎవరు విజేత లౌతారో... 22న తేలుతుంది.