ఇ-ఎంవోల జాడకు ఎస్ఎంఎస్ న్యూఢిల్లీ : మీరు పంపించిన ఇ-మనియార్డర్, స్పీడ్ పోస్టులో పంపిన కానుక మీ వారికి చేరిందో లేదో అన్న ఆతృత వేధిస్తోందా? ఇక నుంచి అలాంటి ఉత్కంఠకు తావు లేదు. మీ సెల్ ఫోన్ నుంచి చిన్న ఎస్ఎంఎస్ ఇస్తే చాలు మీ ఇ-మనియార్డరు లేదా స్పీడ్ పోస్టు ఎక్కడ ఉందో, మీ బంధువులకు, స్నేహితులకు చేరిందో లేదో ఇట్టే తెలిసిపోతుంది. ఈ సౌకర్యాన్ని అన్ని మొబైల్ సర్వీసులు అందించేలా భారత తంతి తపాలా శాఖ కృషి చేస్తోందని తపాలా శాఖ వ్యాపార అభివృద్ధి విభాగం జనరల్ మేనేజర్ అలోక్ శర్మ వివరించారు.
గతంలో మనియార్డరు ఇవ్వగానే దానిని బంగీలలో పెట్టి పంపించేవారు. ఉత్తరం లాగే అది చేరే సరికి ఆలస్యం అయ్యేది. కానీ గత సంవత్సరం అక్టోబర్ నుంచి వీటిని బట్వాడా చేయవలసిన పోస్టాఫీసుకు కంప్యూటర్ లో పంపడం మొదలు పెట్టారు. దాంతో అది త్వరగా చేరడానికి వీలు కుదిరింది. బుక్ చేసిన ఇ-మనియార్డరుకు ప్రత్యేకమైన పిఎన్ ఆర్ నంబరు కేటాయిస్తున్నారు. దాంతో దాని స్థితిగతులను ఇంటర్నెట్ లో చూసుకునే అవకాశం కలిగింది. ఇప్పుడు ఏకంగా సెల్ ఫోన్ ద్వారానే దాని వివరాలు తెలుసుకునే అవకాశం అందుబాటులోకి రానుంది.
బుక్ చేసిన ఇ-మనియార్డరు గురించి తెలుసుకోవాలంటే మీ మొబైల్ లో ఎంవో అని టైప్ చేసి ఒక ఖాళీ వదిలి ఇఎంవో అని టైప్ చేసి పద్దెనిమిది సంఖ్యలు ఉండే పిఎన్ ఆర్ నంబరు టైప్ చేసి 55352 నంబరుకు మెసేజ్ పంపితే చాలు. అలానే స్పీడ్ పోస్టు గురించి తెలుసుకోవాలంటే ఎస్ పి అని టైప్ చేసి ఒక ఖాళీ ఇచ్చి నంబరు టైప్ చేసి 55352 నంబరుకు మెసేజ్ ఇస్తే దాని ఆనుపానులు వెంటనే తెలుస్తాయి. కాగా ఈ సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేసిన మైసూరు తపాలా శిక్షణా కేంద్రం జాయింట్ డైరెక్టర్ ఎస్ రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ వినియోగదారునికి పిఎన్ ఆర్ నంబరు ఇవ్వడంతో పాటు ప్రతీ ఇ-మనియార్డర్, స్పీడ్ పోస్టుకు బార్ కోడ్ ఇస్తామని దాని సాయంతోనే ఆచూకిని తెలుసుకుని వినియోగదారునికి అందిస్తామని చెప్పారు.
News Posted: 14 October, 2009
|